ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమతిచ్చిన మీరే.. నోటీసు ఎలా ఇస్తారు?

తెదేపా అధినేత విశాఖ పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. సెక్షన్​ 151 కింద చంద్రబాబుకు నోటీసు ఎలా ఇస్తారని నిలదీసింది. దీనిపై సమగ్ర అఫిడవిట్​ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. చంద్రబాబు పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ తెదేపా మాజీ ఎమ్మెల్యే కిడారి శ్రావణ్​ కుమార్​ వేసిన లంచ్​ మోషన్​ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేసింది.

'చంద్రబాబుకు ఆ సెక్షన్​ కింద నోటీసులు ఎలా ఇస్తారు..?'
'చంద్రబాబుకు ఆ సెక్షన్​ కింద నోటీసులు ఎలా ఇస్తారు..?'

By

Published : Feb 28, 2020, 4:20 PM IST

Updated : Feb 29, 2020, 6:15 AM IST

ప్రజాచైతన్య యాత్ర కోసం విశాఖపట్నం వెళ్లిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన అనుచరులకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 151 కింద పోలీసులు నోటీసు ఇచ్చి ముందస్తు అరెస్టు చేస్తున్నట్లు పేర్కొనడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కార్యక్రమానికి మీరే అనుమతి ఇచ్చి.. మీరే నోటీసు ఇస్తే ఎలా అని ప్రశ్నించింది. నోటీసు జారీచేయడం సరికాదని ఆక్షేపించింది. ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీకి బేషరతుగా, ప్రతిపక్షానికి షరతులతో అనుమతి ఇవ్వడం సరికాదని హితవు పలికింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో రాష్ట్ర డీజీపీ, విశాఖ పోలీసు కమిషనర్‌ వేర్వేరుగా ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.

విశాఖ, విజయనగరం జిల్లాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెదేపా అధ్యక్షుడు, నాయకులు ప్రజల్ని కలిసే కార్యక్రమాలు, శాంతియుత ఆందోళనలు, సమావేశాలకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని, తగిన భద్రత కల్పించాలని కోరుతూ తెదేపా మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా పిల్‌ దాఖలు చేశారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, విశాఖ పోలీసు కమిషనర్‌, అన్ని జిల్లాల ఎస్పీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. 'ప్రతిపక్షం శాంతియుతంగా నిర్వహించే నిరసనలు, సమావేశాలు, ఆందోళనలను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిరసన కార్యక్రమాలను నిలువరిస్తున్నారు. తగిన భద్రత కల్పించట్లేదు. విశాఖలో ప్రజాచైతన్య యాత్రకు పలు షరతులతో అనుమతిచ్చారు. పోలీసు అనుమతితో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అధికారపార్టీకి చెందిన గుంపును పోలీసులు అనుమతించారు. వారిని నిలువరించేందుకు పోలీసులు చర్యలు తీసుకోలేదు. పోలీసు వాహనాలపై నిల్చొని కేకలు వేస్తున్నవారిని అదుపులోకి తీసుకోలేదు. పోలీసు అనుమతి తీసుకొని కార్యక్రమం నిర్వహించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, ఇతర నాయకులను సెక్షన్‌ 151 కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేశారు. మీ రక్షణకు మిమ్మల్నే అరెస్టు చేస్తున్నాం అన్నట్లు పోలీసుల తీరు ఉంది. విశాఖలో గురువారం నాటి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిర్వహించే నిరసనలను ఇదే తరహా వ్యూహంతో అడ్డుకుంటున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను కలవడానికి గతేడాది నవంబరు 28న ప్రతిపక్షనేత చంద్రబాబు వెళుతున్న సమయంలో ఆటంకం కలిగించినవారికి మద్దతుగా రాష్ట్ర డీజీపీ మాట్లాడారు' అని కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. 'విశాఖలో కార్యక్రమ నిర్వహణకు, ప్రతిపక్షనేత కాన్వాయ్‌కు అనుమతులు ఉన్నాయి. ఇతరులు వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసులు అనుమతించలేదు. ప్రతిపక్షనేత బయటకు వెళ్లే సమయంలో ఒకరిద్దరు వ్యక్తులు అడ్డంకి సృష్టించారు. వారిని తొలగించి ప్రతిపక్ష నేతను పంపే యత్నం చేశాం. ప్రతిపక్షం నిర్వహించే కార్యక్రమానికి అడ్డంకులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి ముందుకెళ్తానని పోలీసుల్ని బలవంతం చేశారు.' అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. సెక్షన్‌ 151 కింద నోటీసు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని పోలీసులను కోరింది. అనుమతిచ్చిన మీరే అడ్డంకులు లేకుండా తగిన చర్యలు తీసుకోకపోతే ఎలా అని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై డీజీపీ, విశాఖ సీపీ వేర్వేరుగా కౌంటర్లు వేయాలంటూ విచారణను వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

'చంద్రబాబును అడ్డుకోవడంలో వైకాపా పాత్ర లేదు'

Last Updated : Feb 29, 2020, 6:15 AM IST

ABOUT THE AUTHOR

...view details