కృష్ణా జిల్లాలో మరిన్ని కొవిడ్ ఆసుపత్రులు నిర్వహించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సహకారం అందించాలని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కోరారు. తన క్యాంపు కార్యాలయంలో కొవిడ్ వైద్య సేవల నిర్వహణపై ఐఎంఏ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో మూడు ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు వైద్యం అందిస్తున్నామని... అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైద్యులు పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారని చెప్పారు.
'ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరో ఐదు ఆసుపత్రుల ద్వారా కొవిడ్ సేవలు అందించేందుకు ఐఎంఏ పూర్తి సహకారం అందించాలి. ప్లాస్మాథెరపీ ద్వారా చికిత్స అందించి రోగిని ప్రమాద స్థాయి నుంచి రక్షించేందుకు వైద్యులు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్లాస్మా బ్యాంకు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి' అని కలెక్టర్ కోరారు.