రెండ్రోజుల్లో హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారిపై... పది గంటల పాటు సాగిన ప్రయాణం... పసిపిల్లల నుంచి పండుముదుసలి దాకా నరకప్రాయాన్ని తలపించింది. నల్గొండ నుంచి హైదరాబాద్ చేరుకోవాలంటే రెండు గంటలు.. రద్దీ ఎక్కువగా ఉంటే రెండున్నర గంటలు. కానీ గత రెండ్రోజుల్లో అందుకు భిన్న వాతావరణం కనిపించింది. బుధవారం తెల్లవారుజామున చౌటుప్పల్ చేరుకున్న ప్రయాణికుడు.. హైదరాబాద్ చేరేందుకు మధ్యాహ్నం దాటింది. జంటనగరాల్లో కురిసిన భారీ వర్షాలకు.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనామ్ గూడ వద్ద రహదారి దెబ్బతింది. అక్కడ ఒక వాహనం ప్రవేశించడానికి మాత్రమే అనుమతించడంతో.. ఇరువైపులా రద్దీ ఏర్పడింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు.. ఇనామ్ గూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటి అంబర్ పేట శివారు వరకు నిలిచిపోయాయి.
10 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
ఇటు హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు.. దండుమల్కాపురం నుంచి ఇనామ్ గూడ వరకు ఆగిపోయాయి. కొత్తగూడెం వద్ద వంతెన.. హైదరాబాద్ వైపున దెబ్బతింది. దీంతో కొద్దిసేపు విజయవాడ వెళ్లే వాటిని.. మరికొంత సేపు హైదరాబాద్ పయనించే వాహనాల్ని వంతుల వారీగా అనుమతించారు. దండుమల్కాపురం నుంచి ఇనామ్ గూడ వరకు ఇంచుమించు.. 10 కిలోమీటర్ల మేర రద్దీ ఏర్పడింది. దారి మళ్లించేందుకు గాను కార్లు, చిన్న సరకు రవాణా వాహనాల్ని... తుఫ్రాన్ పేట నుంచి దండు మైలారం మీదుగా ఇబ్రహీంపట్నం వైపు పంపించారు.