రైతుల పాలిట శాపంగా మారిన జోరు వానలు
రైతుల పాలిట ఏకధాటి వానలు శాపంగా మారాయి. భారీ వర్షాలతో పత్తి, మిర్చి పంటల రైతులు నష్టపోతున్నారు. వర్షాలు కొనసాగితే పత్తి, మిర్చి దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుందని రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలతో పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. రెండు నెలలుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు తదితర మెట్ట ప్రాంతాల్లో మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు..... కాయ దశలో ఉన్న పత్తి రాలిపోతోంది. అలాగే భూమిలో తేమశాతం పెరిగి మిర్చి మొక్క ఎదుగుదలపై ప్రభావం కనబడుతోందని రైతులు చెబుతున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే పత్తి, మిర్చి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.