ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RAINS : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... మునిగిన ఏజెన్సీ.. - ap rain updates

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు ఏకమయ్యాయి. భారీ వర్షాలకు కోస్తాలో పలు జలాశయాల గేట్లు ఎత్తారు. వరద ప్రభావంతో కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు పలు చోట్ల చప్టాలు దెబ్బతిన్నాయి. అటు తెలంగాణలోనూ కుండపోత కురిసింది.

heavy rains
భారీ వర్షాలు

By

Published : Sep 8, 2021, 4:36 AM IST

Updated : Sep 8, 2021, 6:48 AM IST

ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఏకమయ్యాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా చోట్ల 10 సెం.మీ.నుంచి 19 సెం.మీ.వర్షపాతం నమోదైంది. అటు తెలంగాణలోనూ కుండపోత కురిసింది. గరిష్ఠంగా 20 నుంచి 38 సెం.మీ.కుపైగా వర్షపాతం కురవడంతో అక్కడి వరద ఆంధ్రప్రదేశ్‌ వైపు మళ్లింది. కృష్ణా జిల్లాలోని మండలాలతోపాటు ఏజెన్సీలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో మంగళవారం కోస్తాలో పలు జలాశయాల గేట్లు ఎత్తారు. వరద ప్రభావంతో కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు పలు చోట్ల చప్టాలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గోదావరికి వరద పెరగడంతో కాటన్‌ బ్యారేజి నుంచి 4లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని వదులుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేరు, తాండవ, సూరంపాలెం, భూపతిపాలెం, మద్దిగడ్డ జలాశయాలు నిండాయి. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయ గోపురం స్థాయికి వరద చేరింది. సీతారామపురం, తాళ్లరేవు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రొజవొమ్మంగి-అప్పలరాజుపేట మధ్య చప్టా దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోశమ్మ గండి-పి.గొందూరు మధ్య రాకపోకలు నిలిచాయి. రంపచోడవరంలో వాల్మీకిపేటకు చెందిన యువకుడు చేపల వేటకు వెళ్లి సీతపల్లి వాగులో కొట్టుకుపోగా పోలీసులు రక్షించారు. పశ్చిమగోదావరి జిల్లా మన్యంలోని బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరుతోపాటు పలు మండలాల్లో వరద ప్రభావముంది. గుబ్బలమంగమ్మ దర్శనానికి వెళ్లి వస్తూ సోమవారం గల్లంతైన యువతి మృతదేహాన్ని తెలంగాణలో గుర్తించారు. అటవీ ప్రాంతంలో కురిసిన వర్షంతో రేపల్లి, రేగులపాడు, డోలుగండి, మోదెలు గ్రామాలకు చేరుకునే వీల్లేని పరిస్థితి ఉంది. వేలేరుపాడులో పెద్ద వాగు ఉద్ధృతికి రహదారి దెబ్బతింది. కొయ్యలగూడెం మండలం సరిపల్లి వద్ద కొత్తూరు పునరావాస కాలనీకి విద్యుత్‌ సరఫరా నిలిచింది. బుట్టాయగూడెం మండలం అలివేరు వద్ద గుబ్బలమంగమ్మ జలాశయానికి పెద్దఎత్తున వరద చేరడంతో గేట్లు ఎత్తి 150 క్యూసెక్కులను వదిలారు. ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద రావడంతో రెండు గేట్లు ఎత్తి 4వేల క్యూసెక్కులను విడుదల చేశారు. తమ్మిలేరు నుంచి 4వేల క్యూసెక్కులను విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు.

  • తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కుండపోత కురవడంతో కృష్ణా జిల్లాలోని పలు మండలాలకు వరద పోటెత్తింది. వత్సవాయి మండలం లింగాల వద్ద వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో తెలంగాణకు రాకపోకలను నిలిపేశారు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో వరద ఎక్కువగా ఉంది. కట్టలేరు, తమ్మిలేరు. మున్నేరు, వైరా నదులు పొంగి ప్రవహించాయి. విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరం మండలం సోముదేవిపల్లి వద్ద వరాహనది గట్టు కోతకు గురైంది. రోలుగుంటలో 75 ఎకరాల వరి నీట మునిగింది. హుకుంపేట మండలంలో అడ్లుమండకు వెళ్లే మార్గంలో రాకపోకలకు అంతరాయమేర్పడింది.
  • విజయనగరం జిల్లా జామి గోస్తనీ నదిలోని ఫిల్టరేషన్‌ పాయింట్‌ నీట మునగడంతో 26 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచింది. కేసనాపల్లి, గంట్యాడ మండలం పెదవేమలి వద్ద గెడ్డ పొంగింది. గింజేరు వాగు ఉద్ధృతికి గంట్యాడ మండలంలోని వసంత, దిగువ కొండపర్తి పరిధిలోని 16 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. బుడతానపల్లిలో మూడిళ్లు కూలాయి. చంద్రంపేటలో స్లాబు పెచ్చులూడిపడి వ్యక్తికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళికి వరద భారీగా వచ్చింది.

పశ్చిమ వాయువ్యదిశగా అల్పపీడనం

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దాన్ని అనుకొని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో బుధ, గురువారాల్లో తేలికపాటినుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందన్నారు.

ఇదీ చదవండి:TS RAINS: తెలంగాణలో వరుణ ప్రతాపం.. వరద నీటిలో ప్రజల పాట్లు

Last Updated : Sep 8, 2021, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details