ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rains in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా.. వర్షాలు విస్తారంగా...! - heavy rains in ap

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో వానలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది.ఏపీ తీరప్రాంత జిల్లాల్లో గంటకు 20-30 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రభుత్వం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. విశాఖకు 2, పోలవరానికి 2 భద్రాచలం 1, కర్ణాటకకు 4 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించింది.

heavy-rains
heavy-rains

By

Published : Jul 22, 2021, 7:20 AM IST

Updated : Jul 22, 2021, 11:27 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ- 7.6 కి.మీ మధ్య విస్తరించింది. ఈ ప్రభావంతో మరో 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 20-30 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వివరించారు.

కోస్తాలో గురువారం చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు.. రాష్ట్రంలో ఇవాళ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల తరలింపు..

ప్రభుత్వం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. విశాఖకు 2, పోలవరానికి 2, భద్రాచలం 1, కర్ణాటకకు 4 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించింది. వివిధ ప్రాంతాలకు పంపించేందుకు తరలించేందుకు మరో 4 బృందాలను అధికారులు సిధ్ధంగా ఉంచారు. మంగళగిరి ఎన్డీఆర్ఎఫ్ రక్షణ సిబ్బంది... ముంపు ప్రాంతాలకు వెళ్లారు.

విశాఖ జిల్లాలో జోరుగా వర్షాలు...

విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం పూర్తి స్థాయికి చేరుకుంది. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలాశయం నీటి మట్టం ఆశాజనకంగా చేరింది. విశాఖ , తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు నీరందించే ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు 379.5 అడుగులకు నీరు చేరి నట్టు తాండవం జలాశయం అధికారులు ప్రకటించారు. జలాశయం నిండిన మేరకు... ఈ ఏడాది ఖరీఫ్ సీజన్​కు సంబంధించి ఈ నెల 25న నీటి విడుదల చేయడానికి అధికారులు నిర్ణయించారు. స్థానిక శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అధికారులతో చర్చించారు.

గోదావరి జిల్లాలను ముంచెత్తుతున్న వాన

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలో కుండపోతగా వాన పడుతోంది. వర్షాలకు వరినారుమళ్లు నీటమునిగాయి. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట నియోజకవర్గాల్లో వానలు పడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ వ్యాప్తంగా 16 మండలాల్లో 1140.60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అమలాపురంలో అత్యధికంగా 110.80 మిల్లీ మీటర్లు.. కొత్తపేటలో అత్యల్పంగా 48.40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఆత్రేయపురంలో 55.40, రావులపాలెంలో 64.80, ఐ పోలవరంలో 56.60, ముమ్మిడివరంలో 71.60, అయినవెల్లిలో 59.40, పి గన్నవరంలో 75.20, అంబాజీపేటలో 60.40, మామిడికుదురులో 65.60, రాజోలులో 94.40, మలికిపురంలో 65.40, సఖినేటిపల్లిలో 78.20, అల్లవరంలో 90.60, ఉప్పలగుప్తంలో 61.20, కాట్రేనికోనలో 82.60 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

కృష్ణా జిల్లాలో...

విజయవాడలో నిన్నటినుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విజయవాడలో రాత్రి పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది.మొఘల్‌రాజ్‌పురం, సింగ్‌నగర్, బెంజ్ సర్కిల్ ప్రాంతాలు జలమయమయ్యాయి.

గన్నవరం పరిసరాల్లో రెండ్రోజులుగా ఎడతెరపి లేని వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మర్లపాలెం చెరువు పొంగి పంట పొలాలు నీట మునిగాయి. బీబీగూడెం, కేసరపల్లి మండలాల్లోని గ్రామాల్లో పొలాలు నీటమునిగాయి. గన్నవరం, ఉంగుటూరులో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కేసరపల్లి, గొల్లనపల్లి, తెంపల్లి, తేలప్రోలులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీటితో స్థానికులు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.

గుంటూరు జిల్లాలో..

జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నుంచి కురుస్తున్న వర్షాలతో పొలాలు పంటల సాగుకు అనువుగా తయారవుతున్నాయి. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా జనజీవనానికి ఇబ్బందులు తప్పలేదు. గుంటూరు నగరంలో కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం నుంచి ప్రజలు బయటకు రావటానికి ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి వర్షపు నీరు చేరటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

మాచర్ల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, రెంటచింతల ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం ఆగకుండా కురుస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళగిరిలో 24 గంటలుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇక్కడ 33.2 ఎం.ఎం. వర్షపాతం నమోదైంది. నిజాంపట్నం మండలంలో 9.2ఎం.ఎం వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాపట్ల, కాకుమాను, రేపల్లె, ప్రత్తిపాడు, పెదకాకాని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ప్రకాశం జిల్లాలో...

జిల్లాలో రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. మార్కాపురం, తర్లుపాడు మండలాలతో పాటు.. కొనకమిట్ల, పొదిలో భారీ వర్షం ముంచెత్తుతోంది. పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. పొలాల్లో వేసిన మిరపనార్లు, పత్తి పంటకు ఈ వర్షం ఉపయోగకరంగా ఉంటుందని రైతులకు చెబుతున్నారు.

కర్నూలు జిల్లాలో...

మహానంది పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. కర్నూలు నగరం సహా కోడుమూరు, శ్రీశైలం, నంద్యాల, కృష్ణగిరి, కోసిగి, కౌతాళం, మహానంది, బండిఆత్మకూరు, ఎమ్మిగనూరు మండలాల్లో వాన పడుతోంది. మహానందిఫారం గ్రామం వద్ద పాలేరువాగు ఉద్ధృతి కొనసాగుతోంది. మహానంది ఆలయం సహా ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయానికి భక్తుల రాక సైతం ఆగిపోయింది.

మహానంది మండంలో కురుస్తున్న వానలకు... పుట్టుపల్లె సమీపంలోని ఓ బోరుబావిలోంచి నీరు ఊబికి వస్తోంది. మోటర్ వేయకపోయినా... నీరు ఎగసిపడుతోంది. గొల్ల వెంకటరమణ అనే రైతు పొలంలో ఇలా నీరు పైకి వస్తోంది.భూగర్భ జలాలు పెరిగాయని స్థానికులు తెలిపారు.

అనంతపురం జిల్లాలో...

గండ్లపేట మండలం మునగాలవారిపల్లిలో భారీ వర్షాలకు.. ఓ ఇంట్లోని పాత మిద్దె పై కప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 25 గొర్రెలు మృతి చెందాయి.

జలాశయాలకు భారీగా వరద

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వీటికి తోడు.. ఎగువ ప్రాంతాల్లోనూ పడుతున్న వానలతో.. జలాశయాలకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద భారీగా కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 68,491 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా.. 12,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 844.90 అడుగులుగా నమోదైంది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 69.90 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు.

నాగార్జునసాగర్ జలాశయానికి వరద తరలివస్తోంది. ఇన్‌ఫ్లో 28,815 క్యూసెక్కులుగా.. ఔట్‌ప్లో 972 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 534.80 అడుగులకు చేసింది. గరిష్ఠ నీటినిల్వ 312 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 177.66 టీఎంసీల నీరు చేరింది.

జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 58,600 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 66,090 క్యూసెక్కులుగా నమోదైంది. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.325 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది.

ఇదీ చూడండి:

ysr Kapu Nestam: నేడు వైఎస్సార్​ కాపు నేస్తం రెండో ఏడాది నిధులు విడుదల

Last Updated : Jul 22, 2021, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details