వణికిస్తున్న వర్షాలు.. పొంగిన వాగులు.. నీటమునిగిన రహదారులు Heavy Rains in AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు, పలు రహదారులు జలమయమై.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు ఉప్పొంగుతున్నాయి. ఉత్తారాంధ్ర జిల్లాల్లో గంట వ్యవధిలోనే 5 నుంచి 10సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉంగుటూరు మండలంలోని బుడమేరు పరీవాహక ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరడంతో.... ముక్కపాడు, కొయ్యగూరపాడు, ఇందుపల్లిలోని కాలనీలు, పొలాలుజలమయమయ్యాయి. చేపల మేత తీసుకెళ్తున్న వ్యాను పిల్లకోడు వాగు వంతెన వద్ద ఇరుక్కపోవడంతో స్థానికులు దాన్ని అతి కష్టం మీద బయటకు లాగారు. వర్షం ధాటికి గన్నవరం నియోజకవర్గంలోని పలు కాలనీల్లోకి భారీగా నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.
Andhra Pradesh Rains: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అమరావతి మండలం ధరణికోట జైల్ సింగ్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీరు చేరింది. తాడికొండ మండలం పాములపాడు గ్రామ శివారులోని వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరులోని పలు కాలనీలు నీట మునిగాయి. గండాయలపేటలోని ఇళ్లలోకి కొండచిలువ రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లల్లోకి నీరు రావడంతో బిక్కుబిక్కుమంటు బతకాల్సి వస్తుందంటూ వాపోతున్నారు.
భారీ వర్షాల కారణంగా విశాఖ నగరం అతలాకుతలమైంది. దారులన్నీ చెరువులని తలపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో మరోసారి వర్షాలు కళ్లకు కట్టాయి. వివిధ కూడళ్లలో నడుంలోతు నీరు చేరింది. బీచ్ రోడ్డులోనూ అదే పరిస్థితినెలకొంది. సీతమ్మధారలో 7 సెంటిమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా లావేరు, ఎచ్చెర్ల, ఆముదాలవలస, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి.
శ్రీకాకుళం జిల్లాలో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో పిడుగుపాటు గురై ఓ వ్యక్తి, నాలుగు పశువులు మృత్యువాత పడ్డాయి.పశువుల తీసుకుని కొండపైకి వెళ్లినప్పుడు ప్రమాదం జరిగిందనిస్థానికులు తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. దట్టమైన నల్లమల అడవుల్లోని శ్రీశైలం మంచు దుప్పటి కప్పుకుంది. దీంతో ఘాట్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సివస్తుంది.