కృష్ణా జిల్లాలోని పలుచోట్ల అకాల వర్షం కురిసింది. మైలవరం మండలంలో వర్షం కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. పుల్లూరు గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వర్షం కారణంగా ధాన్యం తడిచిపోయింది. ఈ పరిణామంపై.. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తడిచిన ధాన్యాన్ని చూసి లబోదిబోమంటున్నారు.
వారం రోజుల నుంచి కేంద్రంలో ధాన్యం ఉంచినా గింజ కూడా కొనలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు... మామిడి రైతులు సైతం అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతామంటూ వాపోతున్నారు. అప్పటివరకు నిప్పులు చెరిగిన ఎండతో చమటలు కక్కిన మైలవరం వాసులను అకాల వర్షం బెంబేలెత్తించింది. ఈదురు గాలులు వీస్తూ.. మొదలైన వర్షం సుమారు గంటకు పైగా కురిసిన కారణంగా.. జనజీవనం స్తంభించిపోయింది.