ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు..రైతులకు అపార నష్టం - పార్వతీపురం మన్యం జిల్లా నష్టపోయిన రైతులు

Agriculture Damage Due To Heavy Rains: రాష్ట్రంలో అకాల వర్షాలతో పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలులతో కూడిన జోరు వానతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పార్వతీపురం, కృష్ణా జిల్లాల్లో అరటి, మొక్కజొన్న, మినుము పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనంతలో కురిసిన వడగళ్ల వానకు మిరప రైతులు నిండా మునిగిపోయారు. చేతికందిన పంట నీటిపాలు కావడంతో లబోదిబోమంటున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 18, 2023, 11:33 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు

Agriculture Damage Due To Heavy Rains: ఆరుగాలం కష్టించి పడించిన పంట చేతికి రావడానికి రైతలు నానా అవస్థలు పడుతున్నారు. అకాల వర్షాలతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో కల్లాల్లో ఆరబెట్టిన మిరప తడిపోయింది. పంట చేతికి వచ్చే దశలో ఉన్న అరటి, మొక్కజొన్న నేలవాలింది.

మినుము రైతులు ఆందోళన : కృష్ణా జిల్లా మోపిదేవిలో భారీ వర్షం పడింది. జోరు వానకు మినుము రైతులు ఆందోళన చెందుతున్నారు. కోడూరులోనూ కుండపోత వర్షం పడింది. రహదారులు చెరువులను తలపించాయి.

మిరప పంట వర్షార్పణం :అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో వడగళ్ల వర్షం కురిసింది. కలాల్లో ఆరబోసుకున్న మిరప పంట వర్షార్పణం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించింది. చేతికందిన పంట నీటిపాలు కావడంపై దిగులు చెందుతున్నారు. ఖరీఫ్ లో రైతులు సాగుచేసిన మిరప పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. వర్షాల వల్ల ప్రకృతి విపత్తు వల్ల చేతికి వచ్చిన పంట కళ్ల ఎదుట వర్షంలో తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

నేలకొరిగిన అరటి, మొక్కజొన్న : పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ మండలంలో అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. ఈదురు గాలులతో భారీగా వర్షం కురవడంతో పంటలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. అలాగే గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజన్సీ ప్రాంతాల్లో జీడీ, మామిడి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలతో భారీగా నష్టపోయామని..అధికారులు పరిశీలించి పంటలకు నష్టం పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

ఉరుములు, మెరుపులతో వర్షం :అనంతపురం నగరంలో సాయంత్రం గంట పాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో రహదారుల్లో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కాలనీలు బురదమయమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న జేఎన్టీయూ కళాశాలలోనూ అధిక వర్షంతో నీరు నిలిచాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్షం కాస్త తగ్గాక కార్యాలయాలనుంచి ప్రజల ఇళ్లకు చేరుకోవడానికి బయలుదేరారు.

భారీ వర్షం :తిరుమలలో పది నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడింది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details