తీవ్రవాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లాను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన, అంతర్గత రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువుల్ని తలపిస్తున్నాయి. పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు.
విజయవాడలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వన్‌టౌన్ ప్రాంతంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో... స్థానికులు అవస్థలు పడుతున్నారు. మొగల్రాజపురం, విద్యాధరపురం, మధురానగర్, త్యనారాయణపురం పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులు కాలువలను తలపిస్తున్నాయి.
తిరువూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షాలతో... లోతట్టు ప్రాంతాలు, నివాస గృహాలు, రహదారులు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి మురుగునీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కట్లేరు, ఎదుళ్ల, విప్లవాగు, తూర్పు, పడమటి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. నూజివీడు మండలం యనమదల గ్రామాన్ని వర్షపు నీరు చుట్టుముట్టింది. ఇళ్లల్లోకి వస్తున్న వాన నీరు చూసి స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. బావులపాడు మండలం కొత్తపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
భారీ వర్షాలతో వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో మిర్చి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెనుగంచిప్రోలు మండలం శివపురం తండాలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరటంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలారు. జగ్గయ్యపేట మండలంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
గన్నవరం నియోజకవర్గం తెంపల్లి, వీఎన్ పురం కాలనీ, కొత్తగూడెం గ్రామాల్లోకి మోకాల్లోతు నీరు చేరింది. ఏలూరు, బుడమేరు, రివస్ కాలువలు వరదతో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. చాట్రాయి మండలంలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
భారీ వర్షాల దృష్ట్యా తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. అన్ని సెలవులు రద్దు చేసుకుని సిబ్బంది తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు.