నివర్ తుపాను వల్ల కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నాయి. వర్షాల ధాటికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీట మునిగిన పంట చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు.
గన్నవరంలో వందల ఎకరాల్లో పంట నష్టం...
నివర్ తుపానుతో గన్నవరం నియోజకవర్గంలోని వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో కుప్పలేసిన వరి, ఎండబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. పొట్టదశలో కోతకొచ్చిన పంట నేలవాలి రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. అకాల వర్షానికి చేతికందివచ్చిన పంట తడిసి తమకు తీరని ఆవేదన మిగిల్చిందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నాడు.
జలమయమైన విజయవాడ, మచిలీపట్నంలోని ప్రాంతాలు...
నివర్ తుపాను కారణంగా విజయవాడ, మచిలీపట్నంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. బందరు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కోనేరు సెంటర్ నుంచి మచిలీపట్నం బస్టాండ్ వరకు మోకాలు లోతు వర్షపు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పంట పొలాలు నీట మునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తుపానును ఎదిరించిన వివాహం...
నివర్ తుపానుతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితిలోనూ ఓ జంట కోదండరాముడి సాక్షిగా ఒక్కటైంది. మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్న శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఉదయం 8:30 నిమిషాలకు చల్లపల్లి వాసులు వివాహం జరిపించారు. గుడి ఆచారం ప్రకారం నూతన దంపతులకు ఆలయ వ్యవస్థాపకురాలు కోనేరు వెంకట్రామయ్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కోనేరు సరోజినీ దేవి... 10వేల రూపాయలు ఇచ్చి ఆశీర్వదించారు. దేవాలయ నిర్మాణం పూర్తైన తర్వాత మొదటి వివాహం కావడంతో గ్రామంలో పెళ్లి సందడి నెలకొంది.
ఇదీ చదవండీ...లైవ్ అప్డేట్స్: రాష్ట్రంపై నివర్ ప్రభావం.. తొలగని ముప్పు