Harassment of female employee: మహిళలపై వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. స్త్రీలు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. చదువురాని వాళ్లు, పల్లెలు, గ్రామాల్లోనే కాదు... అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల్లో.. సమాజంలో ఎన్నో ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగాలు చేస్తున్నవారిపై కూడా ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. మహిళ అనగానే అవకాశం చూసుకుని మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. శారీరకంగా బలహీనం ఉంటారనే ఒకే ఒక్క అదును చూసుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.
కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని వెలుగు కార్యాలయం అధికారి సుబ్బారావు వేధింపులకు మహిళా ఉద్యోగిని అనారోగ్యంతో ఆసుపత్రి పాలైంది. అధికార పార్టీ నాయకుల తీరుపై మనస్తాపానికి లోనై షాక్కు గురై హైపర్ బీపీతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు వేధింపులకు గురి అవుతుంటే వారికి అధికార పార్టీ నాయకులు కొమ్ము కాయటం హేయమైన చర్యని మహిళా సంఘం నాయకులు ధ్వజమెత్తారు.
ప్రభుత్వ అధికారుల నుంచి న్యాయం జరగకపోవడంతో బాధిత మహిళ కూచిపూడి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సంఘీభావంగా స్థానిక గ్రామాల నుంచి బుక్ కీపర్లు మరియు వెలుగు ఆఫీస్ సిబ్బంది రావడం జరిగింది. వెలుగు కార్యాలయంలో అధికారి సుబ్బారావు వేధింపులకు గురి చేస్తున్నారని పై అధికారుల దృష్టికి శుక్రవారం తెలియజేసినా.. ఇప్పటివరకు అతనిపై చర్యలు తీసుకోకపోగా ఒక మహిళ ఎంపీటీసీ రాజీ ప్రయత్నాలు చేయటం అధికార పార్టీ నాయకుల ఆగడాలు శృతిమించుతున్నాయని సీఐటీయు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.