Handloom workers in Krishna district: చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నామని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. ఒక చేత్తో నేతన్ననేస్తం పథకం పేరుతో సాయం చేస్తూ.. మరో చేత్తో రాయితీలను నిలిపేసింది. గత ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలతో లాభాలు ఆర్జిస్తూ వచ్చిన చేనేత సహకార సంఘాలు.. ప్రసుత్తం నష్టాల బాటపట్టి.. క్రమంగా అప్పుల్లో కూరుకుపోతున్నాయి. కార్మికులకు పని కల్పించలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. సహకార సంఘాల భవనాలను అద్దెకు ఇచ్చి.. ఆ డబ్బుతో సంఘాలను నడుపుకునే స్థితికి పడిపోయాయి.
నేతన్న నేస్తం పథకంతో చేనేత కార్మికుల జీవితాలను ఉద్ధరిస్తున్నామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. ఆ 24 వేల రూపాయలు.. తమను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయని నేతన్నలు వాపోతున్నారు. సాయం చేసినట్లే చేసి.. తమకు రావాల్సిన రాయితీలను ప్రభుత్వం నిలిపివేసిందని.. దీని వల్ల అప్పుల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 36 చేనేత సహకార సంఘాలు ఉంటే.. వాటిల్లో ఎక్కువ శాతం అప్పుల్లోనే ఉన్నాయని.. సంఘాల నాయకులు, సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు నిలిచిపోవడంతో... చేనేత సహకార సంఘాలకు, కార్మికులకు మధ్య దూరం పెరిగింది.
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ.. తెలుగుదేశం ప్రభుత్వం పలు రాయితీలను కల్పించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వాటినన్నింటినీ నిలిపివేసి.. నేతన్న నేస్తం పథకం పేరుతో.. సంవత్సరానికి 24 వేల రూపాయలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఫలితంగా నెలలో సగం రోజులు కూడా కార్మికులకు పని కల్పించలేకపోతున్నామని.. చేనేత సహకార సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల తాము చాలా నష్టపోతున్నామని కార్మికులు వాపోతున్నారు.