ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేసిపెట్టు... ఆదాయం పట్టు..! - పెడన చేనేత వార్తలు

వారంతా చేనేత కార్మికులు. గతంలో కేవలం పట్టు చీరలను మాత్రమే నేసేవారు. ఆదాయం సరిగా లేకపోవడంతో రెండు, మూడు రకాల వస్త్రాలను నేయడంపై దృష్టి పెట్టడంతో వారి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తుండడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

majuri saries
నేసిపెట్టు... ఆదాయం పట్టు!

By

Published : Feb 28, 2021, 6:34 PM IST

జిల్లాలో చేనేత కార్మికులు పట్టు చీరలతోపాటు కాటన్‌ చీరలు, డ్రెస్‌ మెటీరియల్‌ కూడా తయారు చేస్తున్నారు. గతంలో కేవలం పట్టుచీరలు మాత్రమే నేసేవారు. కేవలం ఒకరకంపైనే ఆధారపడితే ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడంతో రెండు, మూడు రకాల వస్త్రాలు నేయడంపై దృష్టి సారిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు తెచ్చుకుని నేసి ఇస్తున్నారు. వేతనాలు ఆశించిన స్థాయిలో ఉండటంతో చేనేత కేంద్రమైన పెడన పట్టణంలో ఈ రకాలు నేయటానికి కార్మికులు ఆసక్తి చూపుతున్నారు. గూడూరు మండలం రాయవరం, కాజ గ్రామాలకు చెందిన మాస్టర్‌ వీవర్లు ఈ రకాల ఉత్పత్తిని విస్తృతం చేసి ఈ ప్రాంత కార్మికులకు ఉపాధి చూపుతున్నారు. గూడూరు మండలం కప్పలదొడ్డి, మల్లవోలు, పోలవరం, ఐదుగుళ్లపల్లి తదితర ప్రాంతాల్లో ఈ రకాల వస్త్రాలు నేస్తున్నారు.

200 మగ్గాలపై నేత

జిల్లా సహకార సంఘాలు, మాస్టర్‌ వీవర్లు ఇచ్చే నూలు రకాలతో పోల్చితే మజూరీ ఆశించిన స్థాయిలో ఉండటంతో కార్మికులు ఈ రకాలు నేయటానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు మంగళగిరి మాస్టర్‌ వీవర్ల నుంచి ముడి సరకులు తీసుకుని పెడన ప్రాంత కార్మికులు ఉత్పత్తి చేసేవారు. తాజాగా మంగళగిరి మాస్టర్‌ వీవర్‌ ఒకరు పెడన పట్టణంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడి కార్మికులకు పూర్తి స్థాయిలో పని చూపిస్తున్నారు. పెడన పట్టణంలో 200 మగ్గాలపై ఈ రకాల్ని ఉత్పత్తి చేసే కార్మికులు ఉన్నారు. మంగళగిరి సాధారణ 50 గజాల మూరకు రూ.2,500 నుంచి నాణ్యమైన రకాలకు రూ.5.300 వరకు మజూరీలు ఇస్తున్నారు. కార్మికుల సామర్థ్యాన్ని బట్టి రోజుకు ఒక చీర చొప్పున వారానికి ఒక సాగ నేయగలుగుతున్నారు. ఈ పనిలో ఏడు గజాల పొడవు ఉండే ఏడు చీరలను కార్మికులు నేయాల్సి ఉంటుంది. పంజాబీ డ్రెస్‌ మెటీరియల్‌లో చున్నీ, టాప్‌ నేయటానికి రూ.3200 వరకు వేతనం ఇస్తున్నారు.

సంఘాల్లో నిలిచిన రాయితీలు

సహకార సంఘాల్లో కొంత కాలంగా కార్మికులకు రాయితీలు నిలిచిపోయాయి. దీంతో ఎక్కడ పని చేసినా ఒక్కటేనన్న భావనలో కార్మికులు ఉన్నారు. త్రిఫ్ట్‌ఫండ్‌, లాభాలు పంచటం, ఆరోగ్య పథకం తదితరమైనవి నిలిచిపోవటంతో సంఘాల్లో పని చేయటానికి కార్మికులు ఆసక్తి చూపటం లేదు. ఈ పథకాల కొనసాగింపుపై మీమాంస కొనసాగుతోంది. ప్రభుత్వం కూడా దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకోక పోవటంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొన్ని సంఘాలు నెలకు రెండు సాగలకన్నా ఎక్కువ పని కల్పించలేక పోతున్నాయి. మరికొన్ని సంఘాలు పని పూర్తయిన వెంటనే సకాలంలో మజూరీలు ఇవ్వలేక పోతున్నాయి. దీంతో కొంత మంది కార్మికులు సహకార సంఘంతోపాటు సమాంతరంగా మంగళగిరి రకాలు కూడా నేయడానికి ముందుకు వస్తున్నారు.

5,380 మంది కార్మికులు

జిల్లాలో 2 మున్సిపాల్టీలు, 29 మండలాల్లో 15,904 మంది చేనేత వృత్తిపై ఆధార పడి ఉన్నారు. క్రియాశీలంగా పనిచేస్తున్న 34 చేనేత సంఘాల్లో 5,380 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి పథకాలు అమలు కావటం లేదు. ప్రస్తుత ప్రభుత్వం మగ్గం ఉన్న నేత కార్మికునికి ఏడాదికి రూ.24 వేలు అందజేస్తోంది.

మంగళగిరి చీరలు నేస్తున్నాం. వేతనాలు బాగున్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సాధారణ నూలు రకాలు నేస్తే కుటుంబం గడవటం కష్టం. ఇంటిల్లిపాదీ కష్టపడతాం. మంగళగిరి రకాలు నేయటం సులువుగా ఉంది. - వాసా మహాలక్ష్మి, చేనేత కార్మికురాలు, పెడన

కరోనా కాలంలో ముడి సరకులు అందక ఇబ్బంది పడినప్పటికీ, తరువాత పరిస్థితి మెరుగుపడింది. నిరంతరం పని కల్పిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రకాలు నేయడానికి అలవాటు పడ్డాం. చేనేత అనుబంధ ఉప వృత్తులన్నీ మేమే చేసుకుంటాం.- జయశ్రీ, చేనేత కార్మికురాలు బ్రహ్మపురం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details