కృష్ణా జిల్లా గుడివాడలో నెహ్రూ చౌక్ వద్ద ఆవు.. లేగ దూడకు జన్మనిచ్చింది. ఆవు గర్భసంచి బయటకు వచ్చి తీవ్ర వేదనతో రహదారి పక్కనే రక్తస్రావంతో బాధ పడుతూ ఉంది. అయినప్పటికీ దాని వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. సమాచారం తెలుసుకున్న గుడివాడ పట్టణ సీఐ గోవింద రాజు.. తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఆవు వద్దకు చేరుకున్నారు. ఆవు పరిస్థితి చూసి చలించిపోయిన సీఐ వెటర్నరీ డాక్టర్ ను పిలిపించారు.
కొన్ని గంటలపాటు శ్రమించి, ఆ ఆవు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు చికిత్స అందించారు. చివరికి ఆ గోమాత ప్రాణాలను కాపాడారు. కాసేపు ఆలస్యమైతే ఆవు ప్రాణాలు పోయేవని వైద్యులు వెల్లడించారు. నోరులేని మూగ జీవి వేదనను గుర్తించి.. వైద్య చికిత్స చేయించి ఆవు ప్రాణాలు నిలిపిన సీఐ, డాక్టర్, సిబ్బందికి అక్కడి ప్రజలు అభినందనలు తెలియజేశారు.