Andhras Gudivada tense: తెలుగుదేశం నేతలైతే రెండేసి కేసులు, వైసీపీ నేతైతే ఒక నామమాత్రపు కేసు.. గుడివాడ లో ఘర్షణకు సంబంధించి పోలీసులు అనుసరిస్తున్న ఫార్ములా ఇది. ఉల్టా కేసులతో పోలీసుల వైఖరి విస్తుగొలిపిస్తోంది. చంపేస్తానంటూ టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుని వైసీపీ నేత కాళీ బెదిరించారు. అన్నట్లుగానే పోలీసుల సమక్షంలోనే పెట్రోలు ప్యాకెట్లు, కత్తులతో దాడి చేయడానికి వచ్చారు. బాధితుడు స్వయంగా ఈ విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేయలేదు. కారణం.. నిందితుడు అధికార వైసీపీకి చెందిన వ్యక్తి కావడమే. తూతూమంత్రంగా తేలికపాటి, త్వరగా బెయిల్ వచ్చేవి, తక్కువ శిక్షలు పడే సెక్షన్లతోనే కేసు కట్టారు.
టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు, అతని కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ వర్గీయులపై ఒక కేసుతోనే సరిపుచ్చారు. బాధితులు అయిన టీడీపీ నేతలపై మాత్రం రెండు కేసులు కట్టారు. వైసీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒకటి, రెండో పట్టణ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా మరొక కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి గుడివాడ పట్టణంలో జరిగిన వైసీపీ నేతల దాడి ఘటనపై పోలీసుల వైఖరి అందరినీ విస్తుగొలుపుతోంది. పోలీసులు పక్షపాతం చూపుతున్నారని టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ కేసుల్లో ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.
తనను చంపుతానని వైసీపీ నాయకుడు మెరుగుమాల కాళీ, అతని అనుచరులు ఫోన్‌లో బెదిరించారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రావి.. ఆదివారం రాత్రి గుడివాడ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసుల సమక్షంలోనే పెట్రోలు ప్యాకెట్లతో దాడులు చేసినా పోలీసులు మాత్రం నామమాత్రంగా ఐపీసీలోని 143, 144, 146, 188, 427, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. దొమ్మీ, ఆస్తులు ధ్వంసం, దాడికి వర్తించే సెక్షన్లను వర్తింపజేశారు. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్‌తో పాటు మరో 20 మంది అంటూ నిందితులుగా పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీ వర్గాల బాహాబాహీలో ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కర్ర తగిలితే టీడీపీ నేతలపై కేసు పెట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.