ఆక్సిజన్ ఫ్లో మీటర్లు 40, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ మాస్కులు 200, పల్స్ ఆక్సీ మీటర్లు 60, ఆక్సిజన్ మాస్కులు 200, సర్జికల్ గౌన్లు 200, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు 8, మల్టీపారామీటర్లు 12, స్తెతస్కోప్‌లు 8 ఏర్పాటు చేశారు. వాటితో పాటు ప్రతి చిన్నారి రోగికి అందజేసేందుకు హిమాలయ హ్యాండ్ శానిటైజర్, ఎన్-95 మాస్కులు, డెటాల్ సబ్బులు, లైజాల్, బ్లీచింగ్ పౌడర్ కిట్లు 715 సరఫరా చేశారు. ఈ నెల 8న మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి ఈ వార్డును ప్రారంభించి దాతను అభినందించారు. పిల్లల వైద్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతోపాటు ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా కొత్త సాంకేతిక పరికరాలు అందించడంతో చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి వీలవుతుందని.. దాతల ఆశయాన్ని సద్వినియోగం చేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవి వెల్లడించారు.
గోడలపై కామిక్ బొమ్మలతో ఆకర్షణీయంగా..
సాధారణంగా ఆస్పత్రికి వెళ్లాలంటే ఎవరైనా జంకుతారు. అక్కడ ఉండే వాతావరణమే దీనికి ప్రధాన కారణం. మందుల వాసన, వైద్య చికిత్సల పోస్టర్లు.. రద్దీగా ఉండే రోగులతో భయం భయంగా ఉంటుంది. అదే పిల్లలకైతే ఆస్పత్రి పేరు చెబితేనే అమ్మో వైద్యులు, నర్సులు, ఇంజక్షన్లు అంటూ మారాం చేస్తారు. కానీ ఆ ఆస్పత్రిలోని పిల్లల వార్డు చూస్తే చిన్నారులు ఎగిరిగంతేస్తారు. ఎందుకంటే అక్కడ కామిక్ బొమ్మలు, ఆడుకునేందుకు ఆట వస్తువులతో ఒక కొత్త లోకంలోకి అడుగు పెట్టినట్లు ఆస్వాదిస్తారు. దాత సహకారంతో లక్షలు వెచ్చించి అందంగా తీర్చిదిద్దడంతో పిల్లల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అదే గుడివాడ ఏరియా ఆస్పత్రిలోని పిల్లల వార్డు.