గత నెల 29న ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రధాన పరీక్షల ఫలితాలను ప్రకటించింది. జవాబుపత్రాల మూల్యాంకనం సరిగా జరలేదని, సాంకేతిక సమస్యలతో సుమారు మూడు వేల మంది అభ్యర్థులు నష్టపోయామని ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరిగిందని ఏపీపీఎస్సీ తెలిపింది. ఏమైనా అనుమానాలుంటే ఏపీపీఎస్సీ కార్యదర్శిని కలవాలని సూచించింది. ఈక్రమంలో విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆవేదనకు గురయ్యారు.
గత ఏడాది డిసెంబర్ 14 నుంచి 20వ తేదీల మధ్య ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రధాన పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల ద్వారా మౌఖిక పరీక్షలకు 1:2 నిష్పత్తిలో ఎంపికచేసిన 326 మంది అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. అదనంగా స్పోర్ట్స్ కోటాలో 75 మంది అభ్యర్థులను ఎంపికచేశారు. జూన్ 14 నుంచి మౌఖిక పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.