ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చదును పేరుతో...రూ.కోట్లు స్వాహా..! - Gravel smuggling in krishna district

గోరంత అనుమతి ఉంటే చాలు.. కొండంతా మాయం చేసే ఘనులు ఎంతో మంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో అదే జరుగుతోంది. అనుమతులు లేకుండా గ్రావెల్‌ తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.

Gravel are being smuggled in the name of flattening land for the poor at jakkampudi in krishna district
చదును పేరుతో...రూ.కోట్లు స్వాహా..!

By

Published : Jun 16, 2020, 6:03 PM IST

అనుమతులు లేవు.. సీనరేజీ చెల్లింపులు లేవు.. గనుల శాఖ ధ్రువీకరణ లేదు.. ఒక ట్రిప్పు అధికారం అయితే.. పది ట్రిప్పులు అనధికారం.. రూ.లక్షల విలువైన సంపద పక్కదారి పట్టిస్తున్న వైనంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. అధికారుల ఆదేశాల మేరకే అంటూ మాఫియా హూంకరింపులు.. ఇదీ కృష్ణా జిల్లాలో గ్రావెల్‌ మాఫియా తీరు. నిరుపేదలకు జులై 8న పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆలోగా లేఅవుట్లను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీనికి అవసరమైన గ్రావెల్​ పేరిట రూ.కోట్లు కొల్లగొట్టారు.

ఇదీ పరిస్థితి..!

పేదల నివాసాలకు స్థలాలను చదును చేసే పేరుతోనూ గ్రావెల్, కంకర అక్రమంగా రవాణా చేస్తున్నారు. జక్కంపూడి ప్రాంతంలో మళ్లీ అక్రమ తవ్వకాలు, గ్రావెల్‌ తరలింపు జోరుగా సాగుతోంది. రేయింబవళ్లు టిప్పర్లు ట్రిప్పులు మీద ట్రిప్పులు వేస్తున్నాయి. చెరువులు, పోరంబోకు భూములను చెరబట్టిన గుత్తేదారులు ప్రస్తుతం కొండలను సైతం వదిలి పెట్టడం లేదు. గతంలో జక్కంపూడి ప్రాంతంలో కొండలను తవ్వడాన్ని ఈనాడు వెలుగులోకి తేవడంతో గనుల శాఖ జోక్యం చేసుకుని జరిమానాలు విధించింది. తాజాగా ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారు.

సాధారణంగా గనుల శాఖ అనుమతులు జారీ చేసిన తర్వాత గ్రావెల్‌, ఇతర ఖనిజాల రవాణాకు వేబిల్లుల అనుమతి పత్రాలను జారీ చేస్తారు. ఒక పత్రంలో తరలించే పరిమాణం, రాయల్టీ ఇతర వివరాలు నమోదు చేసి వాహనం నెంబరు వేస్తారు. ఇవేవీ లేకుండానే తవ్వేస్తున్నారు. తనిఖీకి వచ్చిన అధికారులకు మాత్రం ‘జిల్లా ఉన్నతాధికారులు చెప్పారు.. ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టు నివేశన స్థలాల లేవుట్ల చదునుకు తరలిస్తున్నాం’ అంటూ సమాధానాలు చెబుతున్నారు. నందిగామ, జక్కంపూడి తదితర ప్రాంతాలలో ఈ విధంగా జరుగుతోంది.

జక్కంపూడి గ్రామంలో 234.56 ఎకరాలను జెట్‌సిటీకి కేటాయించారు. జక్కంపూడి, షాబాద్‌ సమీపంలో పేదలకు గృహాలను నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 160 ఎకరాల వరకు దీనికి కేటాయించారు. జక్కంపూడి, షాబాద్‌ గ్రామాల పరిధిలో కొండ ప్రాంతం ఉంది. దీని చుట్టూ తవ్వేశారు. భారీ యంత్రాలను పెట్టి తొలిచేశారు. గ్రావెల్‌ తవ్వకానికి గనుల శాఖకు క్యూబిక్‌ మీటరుకు రూ.50 చొప్పున ఒక లారీకి రూ.600 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆదాయం ప్రస్తుతం గనుల శాఖకు రావడం లేదు. ఇబ్రహీంపట్నం ఈలప్రోలులో నివేశన స్థలాల చదునుకు రూ.3.5 కోట్లు కాంట్రాక్టరుకు అప్పగించారు. కాంట్రాక్టులో గ్రావెల్‌ తరలింపునకు లీడ్‌ చూపించాల్సి ఉంది. అది కాంట్రాక్టర్‌ బాధ్యత. కానీ అధికారులు చెప్పారంటూ గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఇలా ప్రతి లేఅవుట్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. లేఅవుట్లకే దాదాపు రూ.100 కోట్లు పైగా ఖర్చు చేస్తున్నారు. దీన్ని అడ్డంపెట్టుకుని గ్రావెల్‌ను బయట విక్రయిస్తున్నారు. ప్రైవేటు భూముల్లో నింపుతున్నారు. దీనికి తోడు గనుల శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు.

జక్కంపూడి కొండ ప్రాంతం నుంచే కాదు.. కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు.. పోలవరం కాలువ కట్ట ప్రాంతాల నుంచి నిత్యం మట్టి తరలిస్తున్నారు. లక్షల ఘనపు మీటర్ల గ్రావెల్‌ కొల్లగొట్టారు. దీనిపై అధికారులు ఇటీవల తనిఖీలు చేశారు. ఇది ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టు అంటూ వారిని హడలెత్తించారు. బాపులపాడు మండలంలోనూ, కంకిపాడు మండలంలో, గన్నవరం మండలంలో వందల ఎకరాల చదును పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఫిర్యాదులు ఉన్నాయి. లీడ్‌ ఒకచోట.. తరలింపు ఇంకో చోట నుంచి ఉన్నాయి. అసలు చదును వ్యవహారమంతా స్థానిక నాయకులే చేస్తున్నారని కొంతమంది ‘ఈనాడు’ దృష్టికి తీసుకొచ్చారు.

తనిఖీలు చేశాం..!గ్రావెల్‌ తరలింపుపై గనులు భూగర్భ గనుల శాఖ విజయవాడ సహాయ సంచాలకులు నాగినిని ‘ఈనాడు’ సంప్రదించగా జక్కంపూడికి సంబంధించి తనిఖీలు చేశామని, ప్రతిపాదనలు సిద్ధం చేశామని వివరించారు. ఇంతవరకు అనుమతి లేదని, అయితే ప్రభుత్వ ప్రాధాన్యం దృష్ట్యా రవాణాకు అనుమతించాలని కోరుతున్నారని వివరించారు.

ఇదీ చదవండి:సరిహద్దు ఘర్షణపై భారత్​కు నిరసన తెలిపిన చైనా

ABOUT THE AUTHOR

...view details