ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

DEVI NAVARATHRI UTHSAVALU: బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి కళ - ఏపీ లేటెస్ట్ న్యూస్

తిరుమల, విజయవాడలలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి కొలువుదీరారు. శ్రీశైల భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత అలంకరణలో మెరిసిపోయింది.

grandly-celebrated-devi-navarathri-uthsavalu-in-andhra-pradesh
బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి కళ

By

Published : Oct 8, 2021, 7:10 AM IST

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆలయంలోని బంగారు ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు గరుడ పటాన్ని అంతరాలయంలో ఊరేగించి బ్రహ్మాదిదేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ ఎగురవేశారు. రాత్రి 8.30 నుంచి 9.30 గంటల మధ్య పెద్దశేష వాహనసేవ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారు ఆదిశేష వాహనం పైనుంచి అభయప్రదానం చేశారు. కొవిడ్‌ నిబంధనలతో స్వామివారి వాహనసేవను ఏకాంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనసేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది.

శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భృంగి వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేసి విశేష పూజలు నిర్వహించారు.

విజయవాడలో స్వర్ణకవచాలంకృత అలంకరణలో దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం మొదటిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, బాలభోగనివేదన, నిత్యార్చనాదిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉదయం 9.30 నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. రాత్రి 10గంటల వరకు దర్శనాలు కొనసాగాయి. తొలిరోజు 15వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. రెండో రోజు నుంచి ఉదయం 4గంటలకే భక్తులను అనుమతిస్తారు.

వెలుగు విరిసె... గోదారమ్మ మురిసె

కరోనా కారణంగా రాజమహేంద్రవరంలో కొద్ది నెలలుగా నిలిచిన గోదావరి నిత్యహారతి కార్యక్రమం గురువారం సాయంత్రం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ చేతుల మీదుగా పునః ప్రారంభమైంది. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం సహకారంతో ఇది మొదలైంది. వేద పండితులు 14 రకాల హారతులను గోదారమ్మకు సమర్పించారు. సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం నుంచి వచ్చిన చింతా రవిబాలకృష్ణ శిష్యబృందం చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి :GODAVARI: ఏడాదిన్నర తరువాత... గోదావరికి పూర్వ వైభవం

ABOUT THE AUTHOR

...view details