కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులోని కలిదిండి మండలం శివారున ఉంటుంది తాడినాడ గ్రామం. గత పాలకులు, నాయకులు, ప్రజల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా గ్రామం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తోంది. తాడినాడ ప్రస్తుత జనాభా 5000 మంది కాగా, ఒకప్పుడు బాగా వెనుకబడిన ప్రాంతం. ఆ దశలో స్థానికంగా ఏర్పాటు చేసిన బైర్రాజు ఫౌండేషన్ గ్రామ వికాస సమితి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న నంబూరి వెంకటరామరాజు(తాడినాడ బాబు), అప్పటి సర్పంచి కొత్తపల్లి రంగరాజు, ఇతర పెద్దల చొరవతో ప్రత్యేక నిధులను రాబట్టారు. ఫౌండేషన్ పెట్టిన షరతు ప్రకారం గ్రామస్థులు రూ.20 లక్షలు సేకరిస్తే.. మరో రూ.60 లక్షలు వచ్చే మార్గాన్ని చూపించారు. వాటితో సిమెంటు రోడ్లు, అంతర్గత రహదారి నిర్మించాలన్నది ప్రధాన లక్ష్యం. దాతలు ముందకొచ్చి రూ.20లక్షలు సేకరించడంతో ఫౌండేషన్ నుంచి రూ.30లక్షలు, రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ తరఫున రూ.30 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.20 లక్షలు మంజూరు కావడంతో సుమారు రూ.కోటి సమకూరాయి. దానిలో 75 శాతం అంతర్గత డ్రెయినేజీకి, 25 శాతం నిధులను సిమెంటు రహదారుల నిర్మాణానికి వెచ్చించారు. అప్పటి రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాన్ని సైతం ఈ పల్లె అందుకుంది.
చటాకాయ.. అభివృద్ధి ఛాయ
చిత్రంలో కనిపిస్తున్నది కైకలూరులోని చటాకాయ గ్రామం. ఇక్కడ 2300 మంది జనాభా ఉన్నారు.
గ్రామంలో ఏ వీధిలో చూసినా మట్టి రోడ్డు కనిపించదు. డ్రెయినేజీ సదుపాయంతోపాటు నూరుశాతం మరుగుదొడ్లు నిర్మాణం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది ఈ గ్రామం. ఆదర్శ పంచాయతీగా 2009లో నిర్మల్ పురస్కారం అందుకుంది. మురుగు రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కఠినమైన నియమాలను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా వీధుల్లో చెత్త వేయకూడదు, అంతర్గత రోడ్లపై పశువులు పేడ వేస్తే.. వాటి యజమానులు పంచాయతీకి అపరాధ రుసుం చెల్లించేలా షరతులు పెట్టుకుని తప్పనిసరిగా అమలుచేస్తున్నారు. దీనివల్ల పారిశుద్ధ్యానికి పెట్టింది పేరుగా ఈ పల్లె స్ఫూర్తి పరిమళాన్ని వెదజల్లుతోంది.