Grain Farmers are Suffering Due to YCP Government Negligence:తుపాను వెళ్లినా ధాన్యంరైతుల కష్టాలుమాత్రం తీరడం లేదు. తుపాను దాటికి దెబ్బతిన్న రైతులు కొద్దోగొప్పో చేతికి అందిన తడిసిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో తేమశాతం పేరుతో రైతుల ఆశలకు గండికొట్టేలా ఆర్బీకే సిబ్బంది, మిల్లర్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. రైతులను ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో చిత్తశుద్ధి చూపించడం లేదు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏటా 6 లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరిస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం ఇప్పుడిప్పుడే సేకరణ ప్రారంభమవుతుంది. కానీ తేమశాతంపై రెండు జిల్లాల్లోనూ మిల్లర్లు ఒకే రకమైన వైఖరిని అవలంబిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో తేమశాతం ఉన్నప్పటికీ కొంత కొంటున్నా కృష్ణా జిల్లాలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. మిగ్ జాం తుపాను తర్వాత కృష్ణా జిల్లాలో రైతుల నుంచి కొన్న ధాన్యం నామమాత్రమే. కృష్ణా జిల్లాలో 10.50 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా కాగా ఇప్పటివరకు 80 వేల టన్నులు కొన్నారు.
రైతు కష్టాలు పట్టించుకోని సీఎంను దేవుడు కూడా క్షమించడు : చంద్రబాబు
ఎన్టీఆర్ జిల్లాలో ఉత్పత్తి అంచనా 1.35 మెట్రిక్ టన్నులైతే 6 వేల 500 టన్నులు కొన్నారు. మరోవైపు లారీల సమస్య గోనె సంచుల కొరత సమస్య కూడా తోడైంది. రైతు భరోసా కేంద్రాలలో సిబ్బంది వైఖరి సరేసరి. కృష్ణా జిల్లాలో 150 రైస్ మిల్లులున్నాయి. ధాన్యం తేమశాతం 17 శాతం దాటితే ఒక శాతం తేమకు క్వింటాకు కిలో చొప్పున కోత వేస్తున్నారు. దీనికి సిద్ధమై రైతులు విక్రయిస్తుంటే వాటిని కూడా తీసుకోవడానికి నిరాకరిస్తున్న సందర్భాలున్నాయి. రైతులు ఎంతో కొంత ధరకు దళారీలకు సరకును తెగనమ్ముకుంటున్నారు.