varla ramaiah comments on yuvagalam : తెదేపా యువనేత లోకేశ్ పాదయాత్ర సజావుగా, సక్రమంగా జరిగేలా చూడాలన్న ఆలోచన పోలీస్ శాఖకు లేనట్టుందని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. లోకేశ్ పాదయాత్రకే ఎందుకిన్ని నిబంధనలు.. ఆంక్షలు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆ కుర్రాణ్ణి చూసి ముఖ్యమంత్రి ఎందుకు అంతలా వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి పాదయాత్రకు మూడు రోజులు అనుమతిస్తూ పెట్టిన కండిషన్లు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆక్షేపించారు. పాదయాత్ర చేసేవారు అంబులెన్సులు పెట్టుకుంటారా సుధాకర్ రెడ్డి అని నిలదీశారు.
జగన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని అంబులెన్సులు పెట్టుకున్నాడన్నారు. యూనిఫామ్డ్ వాలంటీర్లే రోప్ పార్టీగా వ్యవహరిస్తే పోలీసులేం చేస్తారని ప్రశ్నించారు. గతంలో రోప్ పార్టీలన్నీ పోలీసులే చూసేవారు.. ఇప్పుడు చట్టం మార్చారా ఏంటని మండిపడ్డారు. పాదయాత్రలో ఎవరికీ చీమకుట్టకుండా చూడాల్సింది నిర్వాహకులా... మరి లక్షల జీతాలు తీసుకుంటున్న పోలీసులేం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన దానికంటే జనం ఒక్కరు కూడా ఎక్కువ రాకూడదా, సౌండ్ సిస్టమ్లో సింగిల్ మైక్ మాత్రమే పెట్టాలా..? అని దుయ్యబట్టారు.
5.30 గంటలకే పాదయాత్ర ముగించాలా... జనం రోడ్లపైకి వచ్చే సమయానికి లోకేశ్ కనిపించకూడదా అని నిలదీశారు. పాదయాత్రలో లోకేశ్ ఎవరిని కలుస్తారో ముందే చెప్పాలా అని విమర్శించారు. జగన్ రెడ్డి పాదయాత్రలో సింగిల్ మైకే పెట్టారా డీజీపీ గారు అని ప్రశ్నించారు. జగన్ పాదయాత్రలో మూడు పెద్దపెద్ద సౌండ్ వెహికల్స్ పెట్టిన విషయం మీరు మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు.