ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిశ్రమలకు భూ కేటాయింపులకు ప్రత్యేక కమిటీ... - INDUSTRIAL_WHITE_PAPER

రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కోసం భూముల కేటాయింపులో పారదర్శక విధానం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడుల ప్రతిపాదనలకు పరిశీలనకు ఓ కమిటీ నియమిస్తున్నట్లు పేర్కొంది. కమిటీ పరిశీలించాకే అనుమతులు ఇస్తామని పరిశ్రమలపై విడుదల చేసిన శ్వేతపత్రంలో స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు తెలియజేస్తూనే తాము ఏం చేయబోతున్నది శ్వేతపత్రాల్లో వివరించారు.

పరిశ్రమలకు భూ కేటాయింపులకు ప్రత్యేక కమిటీ...

By

Published : Aug 22, 2019, 12:47 PM IST


పారదర్శక విధానం తీసుకొస్తాం

గడచిన తేదేపా ప్రభుత్వ హయాంలో పరిస్ధితి వివరిస్తూ ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదల చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖపై శ్వేతపత్రాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేయగా.. పరిశ్రమల శాఖ శ్వేత పత్రాన్ని ఆ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విడుదల చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పారిశ్రామిక విధానం తీరు అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడులు పరిశ్రమల స్థాపనకు చేసుకున్న ఒప్పందాల్లో చాలా వరకు ఆచరణలోకి రాలేదని పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. అవన్నీ తాము సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భూ కేటాయింపులు, రాయితీల విషయంలో పారదర్శక విధానం తెస్తామని అభిప్రాయపడ్డారు.

గత ప్రభుత్వం చేసిందేమీ లేదు

విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్‌కయ్యే మొత్తం ఖర్చు ను జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్టు నుంచి గ్రాంట్ రూపంలో పొందే అవకాశం ఉన్నా గత ప్రభుత్వం సాధించ లేకపోయిందని విమర్శించారు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు లోటు భర్తీ నిధి భారం రాష్ట్రంపై పడకుండా కేంద్రంతో చర్చలు జరపలేకపోయిందని ఆరోపించారు. కడపలో ఉక్కుకర్మాగారాన్ని సొంతంగా ఏర్పాటు చేసేందుకు తగిన నిధుల సమీకరణ , ప్రణాళిక లేకుండానే శంకుస్థాపన చేసిందన్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు 1.7 లక్షల కోట్ల విలువైన 91 మెగా ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు కల్పించేందుకు గత ప్రభుత్వం అంగీకరించిందని.. వాటిలో 22 ప్రాజెక్టులే కార్యకలాపాలు ప్రారంభించాయని వివరించారు. గత ఐదేళ్లలో ఎస్‌ఐపీబీ అనుమతులు పొంది, ఆచరణలోకి రాని ప్రాజెక్టులు రద్దు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపిందీ ప్రభుత్వం. వివిధ దశల్లో నిలిచిపోయిన అన్ని తయారీ ప్రాజెక్టులు వేగంగా ప్రారంభమయ్యేలా పారదర్శక, సమర్థ విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు.

అన్నింటికీ ఒకటే వ్యవస్థ

ఏ పెట్టుబడి అయినా పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, వాణిజ్య విభాగం ద్వారా రావాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలు పరిశీలించి అనుమతులిచ్చేందుకు ఎపీఐఐసీ ఆధ్వర్యంలో కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటునకు భూమి కేటాయించాలని వచ్చే దరఖాస్తుల్ని పరిశీలించేందుకు కమిటీ నియమిస్తామని తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల భవిష్యత్తు విస్తరణకు ముందుగానే భూములు కేటాయించడం జరగదని స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అవసరమైన భూమిని రిజర్వు చేసి పెట్టనున్నట్లు తెలిపారు. ఎపీఐఐసీ ద్వారా భూములు పొందిన సంస్థలు చెప్పిన విధంగానే పెట్టుబడి పెట్టాయా... ఉద్యోగాలు కల్పించాయా.. లేదా అనేది నిర్దరించుకునేందుకు ధర్డ్ పార్టీ్ ఆడిట్ జరిపిస్తామని తెలిపారు. ఆడిట్ నివేదిక సంతృప్తి కరంగా ఉంటేనే సేల్ డీడ్ జారీ చేస్తారని స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ పరిశీలించకుండా ఏ ఇతర ప్రభుత్వ శాఖ నుంచి నేరుగా భూముల కేటాయింపు ఉండదని శ్వేతపత్రంలో తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details