విజయవాడ తూర్పు నియోజకవర్గం, పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు, గొడవర్రు గ్రామాల్లోని పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల భూమి చెరువుగా మారింది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 3,108 మంది లబ్ధిదారులకు సెంటున్నర చొప్పున పంపిణీకి గొడవర్రు-రొయ్యూరు సరిహద్దులో ఏనుగులకోడు (డ్రెయిన్) పక్కనే ఉన్న 53.33 ఎకరాల భూమిని ఎకరం రూ.53 లక్షల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ఇక్కడే ఉన్న గొడవర్రు ఊరిచెరువు మాన్యం భూమి సుమారు 10 ఎకరాలను సుమారు ఆరు వందల ప్లాట్లుగా విభజించారు. ఈ రెండు భూముల్లో గత వేసవిలో లేఅవుట్లు వేసి గొడవర్రు ఎస్సీ కాలనీ ద్వారా వెళ్లే డొంక రహదారిపై కొంతమేర రబ్బీసు పోశారు. ఈ భూముల్లోకి ఏనుగులకోడు నీరు ఎగదన్నడంతో రెండున్నర అడుగుల మేర నీరు నిలిచింది. వర్షాలు, దమ్ము చక్రాల ట్రాక్టర్ల ధాటికి అనుసంధాన రహదారి అధ్వానంగా మారింది.