సంపూర్ణ విద్యతోనే పిల్లల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. సంపూర్ణ వృద్ధి సాధించిన పిల్లలు నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో ముందుంటారని చెప్పారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘జీవితంలో రాణించేందుకు సంపూర్ణ విద్య’ అనే అంశంపై శనివారం వర్చువల్ విధానంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో గవర్నర్ రాజ్‌భవన్ నుంచి పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ప్రస్తుత పరిస్థితులు విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన, అనిశ్చితికి దారి తీస్తున్నాయన్నారు.
నిర్బంధ వాతావరణంలో పెరుగుతున్నందువల్లే వారికి ఈ పరిస్థితి ఎదురవుతోందని, నిర్మాణాత్మక మనిషిని చేసే, జీవితాన్నిచ్చే విద్య అవసరమని గవర్నర్ చెప్పారు. సహజ విలువలతో వాస్తవిక ప్రపంచంలో వారి స్థానాన్ని ఎంచుకునేందుకు చిన్నారులకు ప్రాపంచిక విద్య తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ యూకీ, రాజ యోగ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ జాతీయ సమన్వయకర్త రాజయోగి షీలు, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బీకే మృత్యుంజయ, ఆస్ట్రేలియాలో బ్రహ్మకుమారీస్ జాతీయ సమన్వయకర్త చార్లెస్ హాగ్ తదితరులు పాల్గొన్నారు.