కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కరోనా అనుమానిత లక్షణాలున్న వారితో పాటు పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిని అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. క్వారంటైన్ కేంద్రాల్లో 14 రోజుల పాటు ఉంచిన అనంతరం వారిని హోం క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా.. దానికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. అనుమానితులను క్వారంటైన్‌లో 17 రోజులు పూర్తిగా ఉండేలా చర్యలు తీసుకుంటూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలోని మచిలీపట్నం, పెడన, గుడివాడ, నూజివీడు, విజయవాడ, గన్నవరం తదితర ప్రాంతాల్లో 30కి పైగా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈడుపుగల్లు క్వారంటైన్‌లో 86 మంది, పెనమలూరులో 60, నూజివీడు ట్రిపుల్ ఐటీలో 38, నందిగామలో 27, పెడనలో 25, జగ్గయ్యపేటలో 14, బందరులో 22 మంది వంతున జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాల్లో 600 మందికి పైగా ఉంటున్నారు. ఈ కేంద్రాల్లో ఇప్పటి వరకు 14 రోజులు పూర్తిచేసుకున్న వారిని ఇంటికి పంపించి.. గృహ నిర్బంధం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. శనివారం నాటికి మచిలీపట్నంతో పాటు పెడన తదితర ప్రాంతాల్లో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నవారు పదుల సంఖ్యలో ఇంటికి వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వారంతా 17 రోజులపాటు క్వారంటైన్‌ను పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కేంద్రాలను పర్యవేక్షించే అధికారులకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
ర్యాపిడ్ పరీక్షలకు ఏర్పాట్లు:
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. వీటిలో ఎక్కువగా సామాజిక వ్యాప్తి కేసులు ఉంటున్నట్టు తేలడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ర్యాపిడ్ టెస్టులు నిర్వహించేలా ఆదేశాలు జారీ కాగా.. అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఆసుపత్రిలో నాలుగు పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
18వ రోజున ఇంటికి పంపుతాం