నివర్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. బాధిత రైతులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతులకు ఎకరాకు 25వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుపాను నష్టాన్ని అంచనా వేస్తూ బాధితులను ఓదార్చేందుకు తెదేపా నేతలు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వరి పంట పొలాలను తెదేపా నాయకురాలు తంగిరాల సౌమ్య రైతులతో కలసి పరిశీలించారు. అన్నదాతలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నా అధికారులు కనీసం పంట నష్టం అంచనా వేయడానికి ఎందుకు రావడం లేదని ఆమె నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్లో పర్యటించి రైతులకు ఏ విధంగా భరోసా కల్పిస్తారో చెప్పాలని నిలదీశారు.
మొక్క మొలిచినా కొనుగోలు చేయాలి
కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని పరిధిలోని విశ్వనాధపల్లి, నారేపాలెం, పిట్టలంక, సాలెంపాలెం గ్రామాలలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పర్యటించారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. నివర్ తుపాను రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం విఫలం
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలంలో నివర్ వల్ల నష్టపోయిన పంటలను తెదేపా నేతల బృందం ఆదివారం పరిశీలించింది. తెదేపా నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ జీవీ ఆంజనేయులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, ఎస్టీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ ఛైర్మన్ దారునాయక్, మాచెర్ల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి.... రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతుల్ని ముందస్తుగా అప్రమత్తం చేయడం, పంట నష్టం అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారని జీవి ఆంజనేయులు విమర్శించారు.
తాడేపల్లి మండలంలో తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్ చౌదరి పరామర్శించారు. నీట మునిగిన పంటలను పరిశీలించారు. రైతుల బాధలను తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని నేతలు చెప్పారు.
ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలి
పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్, శాసనమండలి సభ్యుడు అంగర రామ్మోహన్ పర్యటించారు. తుపాను వల్ల నష్టపోయిన పంటలను వారు పరిశీలించారు. వైకాపా ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. తక్షణం ప్రభుత్వం ఎకరానికి 30 వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని జవహర్ డిమాండ్ చేశారు.