కేసు నమోదైన ఇంటి నుంచి నుంచి 200 మీటర్ల దూరం వరకు కట్టడి ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వం తెలిపింది. అక్కడ నుంచి అదనంగా మరో 200 మీటర్ల దూరాన్ని బఫర్ జోన్ కింద గుర్తించాలని సూచించింది. భౌగోళికంగా హద్దులను ప్రకటించి తదుపరి చర్యలు తీసుకోవాలని... ఒకేచోట పది కేసులు నమోదైతే అక్కడి నుంచి 500 మీటర్ల దూరం వరకు కట్టడి ప్రాంతంగా గుర్తించాలని పేర్కొంది. ఇక్కడి నుంచి మరో 500 మీటర్ల దూరాన్ని బఫర్ జోన్ కింద గుర్తిస్తున్నట్లు ప్రకటించాలని తెలిపింది. గడిచిన 5 రోజుల్లో కొత్త కేసుల నమోదైతే ఆ ప్రాంతాన్ని వెరీ యాక్టివ్ అని... 6 నుంచి 14 రోజులైతే యాక్టివ్గా... ,కేసుల నమోదు జరిగి 15 నుంచి 28 రోజుల మధ్యన ఉంటే దానిని తీవ్రత లేని ప్రాంతంగా గుర్తించాలని చెప్పింది. పట్టణాల్లో కేసుల నమోదైన ప్రాంతం దగ్గర వీధులు, రెసిడెన్షియల్ కాలనీలు, మున్సిపల్ వార్డులు పక్కపక్కనే ఉంటే వాటిని కూడా కలిపి కట్టడి ప్రాంతాలుగా ప్రకటించాలని...కేసుల నమోదైన గ్రామాలు పక్కపక్కనే ఉంటే వాటిని కూడా కలిపి కట్టడి ప్రాంతాలుగా వెల్లడించాలని పేర్కొంది. కరోనా వ్యాప్తి ప్రభావాన్ని పరిగణనలోనికి తీసుకుని ఈ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
కట్టడి ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలు గుర్తించి బారికేడ్లను ఏర్పాటుచేయాలని... ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారి విషయంలో మినహాయింపు ఇవ్వాలని... పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలియగానే ప్రైమరీ కాంటాక్టును 12 నుంచి 24 గంటల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి గుర్తించిన వారిని ఇంట్లో,ఇతర ప్రదేశంలోనైనా... స్వీయ నిర్భందంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పాజిటివ్ కేసు నమోదు గురించి తెలిసిన వెంటనే చుట్టుపక్కల ఉండే వారికి పరీక్షలు జరపాలని... పరీక్షలు చేయడంలో 60 సంవత్సరాలు పైబడిన వారికి, ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.