Telangana Budget Sessions 2023-24: తెలంగాణ రాష్ట్రంలోని పలు సామాజిక వర్గాలను ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖాయితీ లంబాడాలు, మాలి సహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారీలను ఎస్టీల్లో చేరుస్తూ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, సంఘాల నేతలు సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించామని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు వెల్లడించారు. వాల్మీకి బోయలను కొన్ని రాష్ట్రాలు ఎస్సీలుగా, ఎస్టీలుగా చేర్చారని గుర్తు చేశారు. 1956 నుంచి తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయలు పోరాటం చేస్తున్నారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో వారిని ఎస్టీలో చేర్చాలని ఉద్యమాలు కూడా జరిగాయని పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేశామని మంత్రులు తెలిపారు. ఈ జాతి గురించి సమగ్రంగా ఆలోచించిన సీఎం కేసీఆర్ ఎస్టీలోకి చేర్చుతూ.. అసెంబ్లీలో ఈ రోజు ఏకగ్రీవ తీర్మానం చేశారని వివరించారు. మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువగా ఈ సమస్య ఉందని.. కేసీఆర్ మాత్రమే వారికి న్యాయం చేశారని పేర్కొన్నారు. ఇదే విషయంపై కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని వారు వెల్లడించారు.