కృష్ణా జిల్లాలో ప్రభుత్వ కళాశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. కొన్నింటిలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కంచికచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిస్థితి దారుణంగా ఉంది. 21 ఎకరాల ఆవరణలో ఉన్న ఈ కళాశాల ప్రస్తుతం కంప, పిచ్చి చెట్లతో అడవిని తలపిస్తోంది. కాలేజీకి వెళ్లేందుకు సరైన రోడ్లు లేవు. భవనం ఎక్కడికక్కడ పెచ్చులూడిపోతోంది. తరగతి గదుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. విద్యుత్ బోర్డులు, పైపులు ఊడిపోయి వేలాడుతున్నాయి.
రాత్రి వేళ్లలో కళాశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మందుబాబులకు వేదికగా మారింది. ప్రహరీ గోడ నిర్మాణానికి గతేడాది రూ. 90 లక్షలు మంజూరు చేసినా.. ఇంకా నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం కళాశాలలో 30 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ శిథిలావస్థ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావట్లేదు.