మహాత్మాగాంధీ కుమారుడు దేవదాస్ గాంధీ, రాజాజీ కుమార్తె లక్ష్మిల కుమారుడు గోపాలకృష్ణ గాంధీ. ఆయన 1968 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. దక్షిణాఫ్రికా, శ్రీలంకతోపాటు పలుదేశాల్లో హైకమిషనర్‌గా, లండన్‌లోని నెహ్రూ సెంటర్ డైరెక్టర్‌గా, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన ఈయన భారత రాష్ట్రపతి కార్యదర్శిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం దిల్లీ సమీపంలోని అశోకా విశ్వవిద్యాలయంలో చరిత్ర-రాజనీతిశాస్త్ర ఆచార్యుడిగా పని చేస్తున్నారు.
ధనిక-పేద వ్యత్యాసం పెరుగుతోంది. మల్టీ బిలియనీర్లలో భారతదేశానిది మూడో స్థానం. అదే సమయంలో అధిక శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉంది. మన రాజ్యాంగ నిర్మాతలు దీన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారా...
రాజ్యాంగం వైఫల్యం చెందలేదు. మన జాతినిర్మాతలు సరైన రాజ్యాంగాన్నే ఇచ్చారు. దీనిని నిర్వహించడంలో మన పాత్ర మనం పోషించడం లేదు. ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ విషయం కూడా అంతే. మన పూర్వీకులు సరైన బాటనే వేశారు. దానిని అనుసరించడంలో మనం విఫలమయ్యాం.
గాంధీయిజానికి వారసులు నేడు ఉన్నారంటారా...
ఉన్నారా లేరా అన్నది అంశమే కాదు. గాంధీ ఇలాంటి వాటి గురించి అసలు పట్టించుకొని ఉండరు. ఆయన ఏం కోరుకుని ఉంటారంటే... పోరాడి సాధించుకున్న స్వరాజ్యానికి మనమంతా వారసులమని గుర్తుంచుకుని సుపరిపాలనతో దాన్ని పరిరక్షించుకోవాలని.
స్వాతంత్య్ర సమరయోధులు, దేశం కోసం ప్రాణాలర్పించినవారు ఆశించినదానికి తగ్గట్లుగా దేశం ఈ ఏడున్నర దశాబ్దాల్లో పురోభివృద్ధి సాధించింది అంటారా?
చాలా రంగాల్లో పురోభివృద్ధి సాధించాం. అదేసమయంలో అనేక రంగాల్లో సాధించలేదు. అభివృద్ధి సాధించిన, సాధించని అయిదేసి రంగాల గురించి చెబుతాను.
స్వాతంత్య్రం సిద్ధించాక ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాం. పేదరికం నిర్మూలన, నిరుద్యోగం, పౌష్టికాహారలోపం, స్త్రీ-పురుష అసమానతలు మన దగ్గరే ఎక్కువ ఉన్నట్లు అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇది మనందరికీ అవమానం కాదా?
అభివృద్ధి చెందుతుండటం అనే దశ లేని దేశాలు, సమాజాలు ఎక్కడా ఉండవు. ప్రపంచంలోకెల్లా అభివృద్ధి చెందిన దేశం కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండటమన్నది తప్పూ కాదు, అసాధారణమూ కాదు. మన పంచవర్ష ప్రణాళికలు దేశాన్ని కేవలం ధనిక దేశంగానే కాకుండా అన్నివర్గాలకు సమాన అవకాశాలు లభించే దేశంగా రూపొందించడంలో కొంతవరకు సఫలీకృతమయ్యాయి. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న అభివృద్ధి విధానాలు అన్యాయంగానూ, అసమానతలను ఎక్కువ చేసే విధంగానూ, పర్యావరణం దృష్ట్యా చాలా ప్రమాదకరమైనవిగాను, అనాలోచితంగానూ ఉంటున్నాయి. ప్రభుత్వ విధానాలు, ప్రైవేటు పెట్టుబడులు కొనసాగుతున్న తీరు చూస్తే పల్లెల్లోని ప్రజల భూములన్నీ పారిశ్రామికవేత్తల సొత్తన్నట్లు, చెరువుల స్థానంలో పెద్ద భవంతులు నిర్మించుకోవచ్చన్నట్లూ, గ్రామీణ పేదల పొలాలు, ఆవాసాలంటే రియల్ ఏస్టేటు కేంద్రాలు అన్నట్లు మారిపోతున్నాయి. ఇప్పుడు మనకు నదులంటే విద్యుత్తు, అడవులంటే కలప, కొండరాళ్లంటే సిమెంటు కనపడుతున్నాయి. ఇదే పరిపాటిగా మారితే మన వనరులన్నీ అథఃపాతాళానికి పడిపోయి దేశంలో కొందరు సంపన్నులుగానూ, మరికొందరు దోపిడీకి గురవుతున్న వర్గంగానూ విడిపోతారు. రెండు రకాల దేశంగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితికి వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం రాకుండా, ఎన్నికల సమయంలో డబ్బు కుమ్మరిస్తూ ఈ ఆర్థిక అసమానవర్గాలు రెండూ పరస్పరం సంఘర్షించకుండా చూస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న పెద్ద సవాలు. పరిస్థితి పూర్తిగా చేజారక ముందే కళ్లు తెరిచి చక్కదిద్దుకోవడం అత్యవసరం.
దేశ సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా విస్మరిస్తున్నారని, ఈ పరిస్థితి దేశ ఐక్యతకు, సమగ్రతకు భంగం కలిగిస్తుందని కొందరు మేధావులు వాదిస్తున్నారు. భవిష్యత్తు పరిణామాలపై మీరేమనుకుంటున్నారు.
దేశంలో దక్షిణ, ఈశాన్య ప్రాంతాలు సమాఖ్య స్ఫూర్తికి సంబంధించి మన రాజ్యాంగపు ఆత్మలుగా భావించాలి. గతంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ రెండు ప్రాంతాలూ ప్రత్యేక దేశాలుగా ఉండాలనుకున్నవే. ప్రజాస్వామిక భారతదేశంలో అది అసాధ్యం, అనవసరమని భావించి ఆ ఆలోచన విరమించుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారాల మధ్య ఉండాల్సిన సంతులనానికి ప్రతీకలు ఈ రెండు ప్రాంతాలు. అయితే మనం రాష్ట్రాల గురించి భౌగోళిక-రాజకీయ పరిధుల్ని మించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. భౌగోళిక-రాజకీయ ప్రాంతాలుగా రాష్ట్రాలు మన ఉనికికి సంబంధించిన ఒక సత్యం. అది అలాగే ఉంటుంది. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
కాని పర్యావరణ ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల ఆధారంగా ఓ కొత్త భారత చిత్రపటాన్ని ఊహించవలసిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దేశంలోని 36 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల రాజకీయ మ్యాప్‌లు చెదరకుండా, దేశాన్ని ఎడారి భారతం, అరణ్య భారతం, తీరప్రాంత భారతం, హిమాలయ భారతం అంటూ పర్యావరణపరంగా గుర్తిస్తూ కొత్త మ్యాప్ ఉండటం శ్రేయస్కరం. ఆయా ప్రాంతాలను రక్షించడానికి, పరిరక్షించడానికి, దోపిడీకి గురికాకుండా ఉండటానికి, తవ్వి నాశనం చేయకుండా ఉండటానికి ఇది అవసరం. అంతరించిపోతున్న విలక్షణ మానవ జాతులను, ప్రమాదంలో ఉన్న.. కాపాడుకోదగిన సున్నితమైన ఆవాస ప్రాంతాలుగా కాకుండా దేశ సాంకేతిక-వాణిజ్య అభివృద్ధికి అవకాశమిచ్చే వనరులుగా చూస్తున్నాం. సమాఖ్య వ్యవస్థ అంటే కేవలం రాజకీయాధికారం, పన్నుల పంపకమే కాదు, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వైవిధ్యాన్ని, సున్నితత్వాన్ని గుర్తించడం, గౌరవించడం కూడా.
రాజకీయ పార్టీలు ప్రజలను కులం, మతం, ప్రాంతం, భాష ఇలా రకరకాలుగా విభజించడానికి ప్రయత్నిస్తున్నాయి కదా..
మనం ఎలా ఉన్నామో మన రాజకీయ పార్టీలు అలాగే ఉంటాయి. ఓటర్లను బట్టే రాజకీయ, ఎన్నికల వ్యవస్థలు ఉంటాయి.
బలమైన కేంద్రం-బలహీనమైన రాష్ట్రాలు అనే దిశగా దేశం నడుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఏం జరుగుతుంది?
అవును. అయితే బలహీనమైన కేంద్రం-బలమైన రాష్ట్రాల అనుభవం కూడా మనకుంది. సమస్యల పరిష్కారానికి అది సమాధానం కాదు. ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు అనేదాని వల్ల పెద్ద తేడా ఉండదు, కాకపోతే ఎవరు న్యాయంగా పాలన అందిస్తున్నారు, ఎవరు దీనికి భిన్నంగా ఉన్నారన్నది ప్రధాన అంశం.
కాంగ్రెస్, వామపక్షాలు సమీప భవిష్యత్తులో సరైన ప్రత్యామ్నాయాన్ని అందించే అవకాశం ఉందంటారా?
కాంగ్రెస్ లెప్ట్ వైపు మొగ్గు చూపి, వామపక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగితే వీరిద్దరూ పటిష్ఠంగానే ఉంటారు. వీరు కలిసి పనిచేసి ఇతర ప్రజాస్వామిక పార్టీలతో సహకరించుకొని ముందుకెళ్లడంతోపాటు, ఈ ప్రకియలో తమ అహంభావాన్ని పక్కనపెట్టి పనిచేయగలిగితే బలమైన శక్తిగానే ఉంటారు. బ్రిటిషువాళ్లు మనల్ని విభజించి పాలించలేదు. మనం విడిపోతే వాళ్లు పాలించారు.
యువతకు మీరిచ్చే సలహా ఏంటి? దేశ పురోగతి విషయంలో వాళ్ల నిర్మాణాత్మక పాత్ర ఎలా ఉండాలంటారు?
వారికి సలహా ఇవ్వడానికి నేనెవర్ని? నా తరం వాళ్లు ఇప్పటికే చాలాచాలా మాట్లాడారు. ఇప్పటి యువతరం మాతో విసిగిపోయి ఉన్నారు. పాతతరం చేసిన పొరపాట్లు చాలక, ఇంకా తామే జ్ఞాన సంపన్నులమని అనుకుంటున్నారు. యువత కోరుకుంటున్నది, వాళ్లకు కావల్సింది ఇది కాదు. వాళ్లకు నిజాయతీగా మాట్లాడేవాళ్లు, తప్పుల్ని అంగీకరించి వినయంతో సరిదిద్దుకునేవాళ్లు, రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసం పాకులాడని వాళ్లు కావాలి.