Goddess Nancharamma: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామ చెరువుగట్టున శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారు కొలువుదీరారు. సుమారు 200 సంవత్సరాల పూర్వం కోడూరు మండలం విశ్వనాథపల్లె నుంచి రజకుల ద్వారా పెదప్రోలుకు అమ్మవారు వచ్చినట్లు ప్రతీతి. అమ్మవారికి ఏటా మార్చి నెలలో జాతర నిర్వహిస్తారు. ఈ వేడుకకు భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
ఊరేగింపుగా ఇంటింటికీ..
సహజంగా భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. కానీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారు మాత్రం.. మార్చి నెలలో జాతర ప్రారంభమయ్యాక 15 రోజుల పాటు ఊరేగింపుగా ఇంటింటికీ వెళతారు. వారి నట్టింట కొన్ని గంటలపాటు ఉంటారు. అమ్మవారు రాగానే ఇంటిల్లపాదీ గారెలు, బూరెలు, పాయాసం, పిండివంటలు నైవేద్యంగా సమర్పిస్తారు. తోబుట్టువుగా భావించి పట్టుచీరలు ఇచ్చి సాగనంపుతారు. అమ్మవారు ఇంట్లో అడుగుపెడితే కష్టాలన్నీ తొలగిపోయి.. సౌభాగ్యం వస్తుందన్నది గ్రామస్థుల విశ్వాసం. ఇప్పటికే ఊళ్లోని ఇంటింటికీ వెళ్లి అమ్మవారు పూజలు అందుకున్నారు. నేడు అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రీ అద్దంకి నాంచారమ్మను సుమారు లక్ష మంది భక్తులు దర్చించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈమేరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.