స్త్రీ అంటే.. గమనం. ఆ గమనానికి పుట్టుకతోనే అడ్డుకట్ట పడుతోంది. చిన్నతనంలో చీదరింపులు.. బాల్యవివాహాలు, చదువులోనూ వివక్ష. మన తెలుగు నేలలోనూ ఇలాంటి విపరీత పరిస్థితి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. భారతదేశంలోనే కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో బాలికల నిష్పత్తి తగ్గింది. 0-6 వయస్సు గల వారిలో 1000 మంది మగపిల్లలకు కేవలం 744 మంది అమ్మాయిలే ఉన్నారు. అంతకుముందు 2002 జనాభా లెక్కల్లోనూ ఇదే తీరు కనిపించింది. చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే.. ఆడపిల్లలు సరిపడినంత మంది లేక మగవారికి 35 సంవత్సరాలు వచ్చినా వివాహాలు కానంతగా.. అమ్మాయిల కొరత తయారైంది.
ఇంకా వివక్షే..
అమ్మాయిలకు కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేయడాన్ని భారంగా భావించే చాలామంది.. గ్రామీణ ప్రాంతాల్లో వారి కూతుళ్లను చదివించడం లేదు. ఇప్పటికీ ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించుకునేవారి సంఖ్య ఉంది. గత సంవత్సరంలో నాగాయలంక మండలంలో అంగన్వాడీ సిబ్బంది నమోదు చేసిన వివరాల్లో మగపిల్లలు 161 జన్మిస్తే.. ఆడపిల్లలు 149 మంది పుట్టినట్లు ఉంది.