కిడ్నాపైన పాపను 5 గంటల వ్యవధిలో తల్లిదండ్రుల వద్దకు చేర్చారు కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు. అంబర్ పేట గ్రామానికి చెందిన అక్షర అనే ఆరేళ్ల తమ పాప మంగళవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విజయవాడకు చెందిన చందు అనే వ్యక్తి పాపను అపహరించినట్లు గుర్తించారు. చందు, పాప తండ్రి స్నేహితులు. గత సాయంత్రం చందు, పాప తండ్రికి ఫుల్లుగా మద్యం తాగించాడు. అతను నిద్రలోకి జారుకున్న వెంటనే పాపను తీసుకుని పరారయ్యాడు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.