విష పురుగు కరవటంతో మృతి చెందిన యువతి - పాము కాటు
వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి ఓ యువతి మృతి చెందింది. విషపురుగు కరవటంతో ఆమె పంట చేలోనే పడిపోయింది.
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ఎస్సీ ఉత్తర హరిజనవాడలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన కొమ్ము రోజా(19) అనే యువతి ఉదయం వ్యవసాయ కూలీ పనికి వెళ్లింది. పత్తి పంటలో కలుపు తీస్తుండగా విషపురుగు కరిచింది. ఆమె అక్కడికక్కడే పడిపోయింది. తోటి కూలీలు ప్రాథమిక వైద్యం కోసం కంచికచర్ల తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆంధ్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కూతురు కళ్లముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.