పెట్రో ధరల బాటలోనే వంట గ్యాస్ ధరలూ భగ్గుమన్నాయి. గత రెండు నెలలుగా నిలకడగా ఉన్న వంట ఇంధనం ధరలు గురువారం ఒక్కసారిగా పేలాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను కేంద్రం రూ.25.50 పెంచింది. బుధవారం వరకు దీని ధర రూ.861.50 ఉండగా.. ఇప్పుడు రూ.887కు చేరింది. అలానే 19 కిలోల వాణిజ్య వినియోగ సిలిండర్‌పై రూ.84.50 పెంచారు. దీని ధర రూ.1730.50కి చేరింది. పెట్రోలు, డీజిల్ తరహాలోనే దూరం ఆధారంగా వీటి ధరల్లో మార్పులు ఉంటాయి. హైదరాబాద్‌లో వంట గ్యాస్ సిలిండరు ధర రూ.887కు చేరగా.. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా రూ.911.50కు పెరిగింది.
ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు సెగలు కక్కుతుండగా.. తాజాగా వంట గ్యాస్ ధర భగ్గుమనటంతో సామాన్యుడు ఆర్థికంగా మసకబారిపోతున్నాడు. కరోనా ముప్పేట దాడితో ఆర్థికంగా అతలాకుతలం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.