కరోనాతో మృతి చెందిన రోగి బంధువుల దాడికి నిరసనగా తెలంగాణ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని జూడాలు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు ...తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఓ వైద్యుడిపై దాడిని ఖండిస్తూ పూర్తి స్థాయిలో విధులను బహిష్కరించి... గాంధీ ఆసుపత్రి బయట రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు జూడాల నిరసనలతో కరోనా రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తుంటే...తమపై దాడికి పాల్పడటం దారుణమని జుడాలు వాపోయారు. అన్ని వార్డుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఐదు డిమాండ్లు..
గాంధీ ఆసుపత్రిలో మెుత్తం1000 మంది జూనియర్ డాక్టర్లు ఉండగా.... ప్రస్తుతం 300 మంది జూడాలు పూర్తి స్థాయిలో విధుల్లో కొనసాగుతున్నారు. తమపై అధిక పనిభారం ఉన్నా విధులు నిర్వర్తిస్తున్నామని జూడాలు చెబుతున్నారు. ధర్నాకు దిగిన వైద్యులతో మంత్రి ఈటల దాదాపు 3 గంటల పాటు చర్చలు నిర్వహించారు. ప్రధానంగా ఐదు డిమాండ్లను జూడాలు మంత్రి ముందుంచారు.