ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మళ్లీ ఊపందుకుంటున్న శుభకార్యాలు..చాలామందికి ఉపాధి - celebrations and functions news

కరోనా కాస్త ఉపశమించింది... జనజీవనం మెల్లమెల్లగా సాధారణ స్థాయికి చేరుకుంటోంది. మార్చి నుంచి వాయిదా వేసుకుంటున్న శుభకార్యక్రమాలు అక్టోబరు నుంచి మొదలుపెట్టారు. ఈ నెలలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఉండటంతో కృష్ణాజిల్లా నూతన శోభను సంతరించుకుంటోంది.

functions
శ్రీరస్తు... శుభమస్తు

By

Published : Nov 8, 2020, 2:51 PM IST

కృష్ణా జిల్లాలోని విజయవాడ నగరంతోపాటు మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, గన్నవరం, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లోనూ శుభకార్యాల సందడి కనిపిస్తుంది. ఆన్‌లాక్‌-5లో పెళ్లిళ్లపై ఆంక్షలు సడలించడంతో ఉన్నంతలో ఘనంగా వేడుకల్ని ప్రజలు నిర్వహించుకుంటున్నారు. జనవరి నుంచి మళ్లీ ఏప్రిల్‌ వరకు శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో నవంబరు, డిసెంబరు నెలల్లోనే వాటిని పూర్తి చేయాలనే ఆలోచన చాలామంది చేస్తున్నారు.

గత నెల 24వ తేదీ నుంచి ఈ నెల 4 వరకు జిల్లాలో వందలాది వివాహాలు, నిశ్చితార్ధాలు, పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. మార్చి, ఏప్రిల్‌లోనే గృహనిర్మాణాలు పూర్తయి ప్రవేశాలు జరగని వేడుకలన్ని నాలుగైదు రోజులుగా ఊపందుకుంటున్నాయి. శుభకార్యాలు వేగం అందుకోవడంతో వాటిపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేడుకలకు ప్రజలు హాజరవుతున్నారు. శుభకర వేదికల్లోనూ కొవిడ్‌ జాగ్రత్తలు ఉంటున్నాయి. మాస్క్‌లు.. శానిటైజర్లు.. ఎడంగా కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన శుభకార్యాల్లో ఎక్కడా కొవిడ్‌ కేసులు నమోదవ్వకపోవడం స్వీయ రక్షణ జాగ్రత్తల్ని సూచిస్తుంది.

నవంబరులో 9, 11, 19, 20, 21, 22, 23, 25, 26, 27, 30 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. వచ్చే నెలలో అయితే ఏకంగా 17 రోజులు శుభకార్యాలకు అనువైన పరిస్థితులున్నాయి. కరోనా సమయంలో కేవలం 10 నుంచి 20 మందితోనే పెళ్లిళ్లు చేసుకున్నవారు ఇప్పుడు బంధుమిత్రులు, ఆప్తులు, స్నేహితుల్ని ఆహ్వానించి వేడుక ద్వారా వారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మార్చి నుంచి సెప్టెంబరు వరకు కల్యాణ మండపం మూసేశామని అక్టోబరులోనూ 7, 8 రోజులే వేడుకలకు మండపం బుక్‌ అయ్యిందని.. అదే నవంబరు, డిసెంబరులో ఇప్పటికే సగం రోజులకు ముందస్తు బుకింగ్‌ జరిగినట్లు విజయవాడ నగరానికి ప్రముఖ కల్యాణ మండపాల నిర్వాహకులు చెప్పారు. నగరంలో వేదికలు ఖాళీలేకపోవడంతో మంగళగిరిలోని రిసార్టులు, ప్రముఖ కన్వెన్షన్‌ సెంటర్లను ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు.

కరోనా నుంచి బయటపడి శుభకార్యాలకు గత వారం రోజుల నుంచి చాలామంది ముందుకొస్తున్నారని ఈవెంట్‌ మేనేజర్లు కల్యాణ్‌, అన్సారి తెలిపారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన తమకు మళ్లీ చేతినిండా పని దొరకడం మొదలయ్యందని ఫోటో, వీడియోగ్రాఫర్లు శ్రీనివాస్‌, వినోద్‌ చెప్పారు. శుభకార్యాలతో వస్త్ర, వెండి, బంగారం, పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారాలు జోరందుకుంటున్నాయి. క్యాటరింగ్‌తోనూ చాలామంది ఉపాధి పొందుతున్నారు.

ఇదీ చదవండి:'జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చారు'

ABOUT THE AUTHOR

...view details