Venkaiah Naidu: జీవితానికి పరమార్థం ఉండాలంటే ఎంచుకున్న రంగంలో ప్రావీణ్యం సాధించాలని, అందుకు విషయం, విలువలతో కూడిన భాషా పరిజ్ఞానం అవసరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టు ఆవరణలో ఆదివారం స్వాతంత్య్ర సంగ్రామ ధీరుల వీరగాథలతో కూడిన ‘శ్రీవాణి’ సాంస్కృతిక మాసపత్రిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పత్రిక సంపాదకురాలు కొమరగిరి జయప్రద, సహ సంపాదకులు కొమరగిరి శ్యామ్‌ప్రసాద్, హాస్యనటుడు బ్రహ్మానందం, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గేయ రచయిత భువనచంద్ర, పాత్రికేయుడు మారుతీ సుబ్బరాయశర్మ (మాశర్మ), స్వర్ణభారత్ ట్రస్టు ఛైర్మన్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. భారతీయ విలువలతో కూడిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహితీరంగం అభివృద్ధిలో శ్రీవాణి మాసపత్రిక ప్రాధాన్యాన్ని, వెంకయ్యనాయుడి సేవలను కొనియాడారు. మంచి విత్తనం మాత్రమే సత్ఫలితాలనివ్వగలదని, అందుకు నిదర్శనమే తెలుగు సాంస్కృతిక మాసపత్రిక శ్రీవాణి, స్వర్ణభారత్ ట్రస్టు అని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. ఇప్పటివరకూ సమరయోధులపై సరైన పుస్తకమే రాలేదని, శ్రీవాణి ప్రత్యేక సంచిక తీసుకురావడం గొప్ప విషయమని గేయ రచయిత భువనచంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావు, ఇతర ప్రముఖులు, ట్రస్టు ప్రతినిధులు చుక్కపల్లి ప్రసాద్, పరదేశి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవాణి మాస పత్రిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ.. పాల్గొన్న వెంకయ్యనాయుడు - ‘శ్రీవాణి’ సాంస్కృతిక మాసపత్రిక
Venkaiah Naidu: స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను శ్రీవాణి మాస పత్రిక ప్రత్యేక సంచికలో ప్రచురించటం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నేటితరం యువతకు సమరయోధుల పోరాట పటిమ గురించి తెలియాలని ఆయన అన్నారు.
మాసపత్రిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ