ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP: 'వివేకా హత్య కేసులో చివరకు ధర్మమే గెలుస్తుంది.. పులివెందుల ప్రజలు అమాయకులు కాదు'

TDP : వైఎస్ వివేకా హత్య కేసులో అధికారాన్ని, తన ఎంపీ పదవిని వాడుకుని బయటపడేవాడిని అని అవినాష్ రెడ్డి చెప్పకనే చెప్పాడని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు. రాత్రికి రాత్రి హత్య ప్లాన్ చేసి ఆధారాలు చెరిపేయడం జిల్లా ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. సునీతకు త్వరలో న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇక.. ప్రభుత్వం అందిస్తోన్న పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, సీఎం జగన్ బటన్ నొక్కుడు పేరుతో వేల కోట్లు బొక్కేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 26, 2023, 5:17 PM IST

TDP: వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడిన చిట్​చాట్​పై తెలుగు దేశం మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మండిపడ్డారు. తన అన్న అధికారాన్ని, ఎంపీ పదవిని వాడుకొని ఈ కేసు నుంచి బయటపడే వాడినని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పకనే చెప్పాడని తెలిపారు. రాత్రికి రాత్రి మర్డర్​కు ప్లాన్ చేసి రక్తపు మరకలను తురిచిన నీ గురించి జిల్లా ప్రజలకు తెలుసునని అన్నారు. నీ మంచితనం గురించి తెలియడానికి నువ్వేమీ పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి కాదు అని పేర్కొన్నారు. వైయస్ అవినాష్ రెడ్డి మాపై నిందలు మోపి రాజకీయంగా జిల్లాలో మళ్లీ తిరగాలని చూస్తున్నాడని తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డిపై సీబీఐకి ఎందుకు కక్ష ఉంటుందని ప్రశ్నించారు. తప్పు చేశాడు కాబట్టే.. సీబీఐ దోషిగా చెబుతోందని, ఒకరు ఇచ్చిన స్క్రిప్ట్ చదివే మనస్తత్వం నాది కాదని అన్నారు. సీబీఐ విచారణకు పిలిస్తే.. ప్రశ్నలను ముందే అడిగి హైకోర్టులో చివాట్లు తిన్నది మీరే అని అవినాష్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. సునీత కు త్వరలో న్యాయం జరుగుతుందని తెలిపారు.

అవినాష్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ పేరిట మాట్లాడుతూ... తాను వైఎస్ వివేకా హత్య కేసును సీరియస్​గా తీసుకోలేదని అన్నారు. పైగా, తాను కేసు నుంచి బయపడాలని అనుకోలేదని, అలా అనుకుంటే మాకున్న అధికారాన్ని ఉపయోగించి ఎప్పుడో బయటపడేవాళ్లం అన్నాడు.. అంటే అందులో ఉద్దేశం ఏమిటి..? ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలు ఏమనుకోవాలి. తెలుగుదేశం నాయకులు స్థానికంగా ఉండే బీటెక్ రవితో తిట్టిస్తున్నాడని ఆరోపించారు. అసలు నేను అవినాష్ రెడ్డిని ఎప్పుడూ తిట్టలేదు. చాలా పద్ధతిలో మాట్లాడాను తప్ప.. ఇష్టం వచ్చినట్టు తిట్టలేదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అలా మాట్లాడతారు తప్ప నేను అలా కాదు. తన గురించి కడప జిల్లా అందరికీ తెలుసు అని మాట్లాడిన అవినాష్ రెడ్డి.. ఆయనేమైనా గొప్ప నాయకుడా..? వ్యక్తిగతంగా అవినాష్ రెడ్డిపై మాకు కోపం ఏమీ లేదు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన వారిపైనే మా కోపం. సాక్ష్యాలను తారుమారు చేసిన వారిపైనే మా కోపం. అది మీకు వర్తిస్తుంది. పులివెందుల ప్రజలు అమాయకులు కారు.. సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు.. తప్పకుండా ధర్మం, న్యాయమే గెలుస్తుంది. - బీటెక్ రవి, తెలుగు దేశం మాజీ ఎమ్మెల్సీ

ప్రభుత్వం అందిస్తోన్న డీబీటీ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. సీఎం జగన్ బటన్ నొక్కుడు పేరుతో వేల కోట్లు బొక్కేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఖాతాల్లోకి వెళ్లాల్సిన సొమ్ము గ్రామ సచివాలయాల ద్వారా తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతోందని ధ్వజమెత్తారు. బటన్ నొక్కుడు అవినీతిలో సజ్జల సహా ఐఏఎస్​లు ధనుంజయ రెడ్డి, రావత్, సత్యనారాయణ అందరూ పాత్రధారులేనని..వారంతా ఏదో ఒకనాడు జైలుపాలు కాక తప్పదని హెచ్చరించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details