Yanamala comments on Bulk Drug Park:కాకినాడ సెజ్‌లో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పని తెదేపా సీనియర్ నేత మాజీమంత్రి యనమల రామకృష్ణుడు.. కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శికి ఫిర్యాదు చేసిన లేఖలో పేర్కొన్నారు. లేఖ ప్రతులను జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపారు. ఫార్మా పార్క్ ఏర్పాటు వల్ల మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దాదాపు 300 హేచరీలు ఇక్కడ ఉన్నాయని.. ఫార్మా పార్క్ ఏర్పాటు వల్ల నీరు, నేల, సముద్రం కలుషితమై రైతులు, మత్స్య కారుల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. ఫార్మా పరిశ్రమ వద్దంటూ మత్స్యకారులు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుందని యనమల తెలిపారు. ప్రజలు అంగవైకల్యం, మలబద్ధకం, అతిసారం, మగత, నొప్పి, చర్మ జీర్ణశయ వ్యాధులకు గురైయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లింపు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పక్కనే ఉన్న హెటెరో డ్రగ్స్ ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎన్జీటీ రూ. 6.94 కోట్ల పెనాల్టీ విధించిందన్నారు. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని యనమల రామకృష్ణుడు కోరారు.