Ganta fire on cm jagan : ముఖ్యమంత్రి ప్రారంభించిన 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు చిన్నాభిన్నమైపోయారని వ్యాఖ్యానించారు. రాజధాని కోసం తమ పొలాలు అప్పగించి దగా పడ్డ అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తారా..? లేక.. జీతం ఎప్పుడు వస్తుందో అని ప్రతి నెలా ఎదురు చూసే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..? అని ప్రశ్నించారు. కరవుతో అల్లాడుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న పేద రైతుల సమస్యలు పరిష్కరించగలరా..? పెన్షన్ కోసం ఎదురు చూసే రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యలు తీరుస్తారా..? అని పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగులకు అండగా ఉంటారా..? లేక.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తారని నమ్మి మోసపోయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా జీతాలు సరిగ్గా పడక, జీతాలు పెరగక అవస్థలు పడుతున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తారా..? అని ప్రశ్నలను సంధించారు.
మద్య నిషేధం అమలేదీ.. అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఆపై దానినే ఆదాయ వనరుగా మార్చి.. కొత్త నాసిరకం బ్రాండ్లు తాగి ప్రాణాలు కోల్పోయి బజారున పడ్డ వారి కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరిస్తారా..? అని శ్రీనివాసరావు దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పోగొట్టుకున్న అవ్వ, తాతల సమస్యలు పరిష్కరిస్తారా..? లేక.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కానీ.. ఒక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లేక ఎదురు చూస్తున్న నిరుద్యోగుల సమస్యలు తీరుస్తారా..? అని నిలదీశారు. ఉచితంగా అందించే ఇసుకను వ్యాపార మయం చేసి... సరైన ఉపాధి దొరక్క సుమారుగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు తీరుస్తారా..? అని అన్నారు.