ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బల్దియా పీఠాన్ని అధిష్టించిన మహిళామణులు... అభివృద్ధే లక్ష్యం - Ghmc meyor news

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ అగ్ర పీఠాలను తొలిసారిగా మహిళామణులు కైవసం చేసుకున్నారు. మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి తెరాస సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు కూతురు కాగా ఉప మేయర్‌గా గెలుపొందిన మోతె శ్రీలత తార్నాక డివిజన్‌ నుంచి గెలుపొందారు.

బల్దియా పీఠాన్ని అధిష్టించిన మహిళామణులు... అభివృద్దే లక్ష్యం
బల్దియా పీఠాన్ని అధిష్టించిన మహిళామణులు... అభివృద్దే లక్ష్యం

By

Published : Feb 12, 2021, 2:22 AM IST

Updated : Feb 12, 2021, 2:36 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్ పరిపాలన పీఠాలను తొలిసారి మహిళలు అధిష్టించారు. కొన్ని నెలలుగా నగర ప్రథమ, ద్వితీయ పౌరుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తెరాస సీనియర్‌ నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్‌ ప్రథమ మహిళగా ఎన్నికయ్యారు. బంజారాహిల్స్‌ నుంచి కార్పొరేటర్‌గా రెండుసార్లు విజయలక్ష్మి గెలుపొందారు.

మేయర్ విద్యాభ్యాసం...

విజయలక్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌ పరిధిలోనే సాగింది. ప్రాథమిక విద్య హోలీమేరి పాఠశాలలో పూర్తిచేశారు. అనంతరం రెడ్డి ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్‌, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం చేశారు. సుల్తాన్‌ ఉల్‌ లూమ్‌ న్యాయ కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించారు. వివాహానంతరం ఆమె 18 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్నారు. ఆ సయమంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్‌ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో సహాయక పరిశోధకురాలిగా పనిచేశారు.

అభివృద్ధి పథంలో తీసుకెళ్తా...

2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని భారత్‌కు తిరుగుముఖం పట్టిన విజయలక్ష్మి... రాజకీయాల్లోకి ప్రవేశించి తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. 2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో తెరాస తరఫున భారీ మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి డివిజన్‌ అభివృద్ధికి విజయలక్ష్మి తనవంతు పాత్ర పోషించారు. జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికవడం పట్ల విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్న విజయలక్ష్మి... అన్ని పార్టీల సభ్యులతో కలిసి నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

నగరవాసులకు అందుబాటులో...

జీహెచ్ఎంసీ ఉప మేయర్‌గా మోతె శ్రీలత ఎన్నికయ్యారు. తార్నాక డివిజన్‌ నుంచి గెలిచిన శ్రీలత... తెరాస సీనియర్‌ నేత మోతె శోభన్‌ రెడ్డి సతీమణి. కొంతకాలం పాటు తెరాస మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. 2001లో తెరాస ఆవిర్భావం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో శ్రీలత భర్త మోతె శోభన్‌ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్​కు వెన్నంటి ఉండి క్లిష్ఠ పరిస్థితుల్లోనూ అండగా నిలబడ్డారు.

తనకు ఉప మేయర్‌ పదవి రావడం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించిన శ్రీలత... నగరవాసులకు అందుబాటులో ఉంటూ... గ్రేటర్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఇద్దరు మహిళామణుల సారథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ అభివృద్ధి మరింత పరుగులు పెట్టాలని పలు పార్టీల నాయకులు ఆకాంక్షించారు.

బల్దియా పీఠాన్ని అధిష్టించిన మహిళామణులు... అభివృద్దే లక్ష్యం

ఇదీ చూడండి : పల్లెపోరు రెండో విడతకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్ !

Last Updated : Feb 12, 2021, 2:36 AM IST

ABOUT THE AUTHOR

...view details