ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండుతున్న పూల ధరలు.. అయినా రైతుకు అందని లాభాలు - పడిపోతున్న పూల ధరలు

మార్కెట్లో పూల ధరలు మండుతున్నా.. వాటిని సాగు చేస్తున్న రైతన్న మాత్రం వాడిపోతూనే ఉన్నాడు. కరోనా ప్రభావం నుంచి ఇంకా కోలుకోని సన్నకారు రైతన్న.. కనీసం పెట్టుబడైనా వస్తుందా.. రాదా? అనే ఆందోళనలో ఉన్నాడు. పూల వినియోగం పడిపోవడం ఓ కారణమైతే.. మార్కెట్​లో రైతకు ఇచ్చే రేట్​ అంతంత మాత్రంగానే ఉండటంతో దిక్కుతోచని స్థితిలో నలిగిపోతున్నాడు పూల రైతన్న.

flower farmers getting low income
మండుతున్న పూల ధరలు.. అయినా రైతుకు అందని లాభాలు

By

Published : Dec 29, 2020, 11:50 AM IST

పూల సాగు సన్నకారు రైతుల ముఖాల్లో నవ్వులు పూయించడంలేదు. కరోనా ప్రభావం నుంచి సాగుదారులు ఇంకా ఏ మాత్రం కోలుకోవడంలేదు. మార్కెట్లో పూల ధరలు వినియోగదారులకు ఒకింత భారంగా అనిపిస్తున్నా.. పండించిన రైతుకు మాత్రం ఆశించిన స్థాయిలో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితిలో లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఏ పండుగ అయినా కళ అంతంత మాత్రంగానే ఉండడం.. వివాహాలు, ఇతర కార్యక్రమాల సందడి తగినంత లేకపోవడం.. అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు హడావుడి కూడా తక్కువగా ఉన్నందున పూల వినియోగం బాగా తగ్గిపోయింది. తోటల్లో పూలను మార్కెట్‌కు తీసుకెళ్లినా తగినంత ధర లేకపోవడంతో చాలా మంది రైతులు పొలాల్లో మొక్కలను దున్నేస్తూ ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నారు. ఇంకొందరు కొన్ని వరుసల్లో మొక్కలను తొలగించి అంతర పంటలు వేసుకుని పూల నష్టాలను పూడ్చుకుంటున్నారు.

మండుతున్న పూల ధరలు

పరిమళించని మల్లెపూలు..

కృష్ణా జిల్లాలో పూలసాగు రైతులకు కన్నీటిని మిగులుస్తోంది. ఓవైపు వాతావరణం అనుకూలించక.. మరోవైపు ప్రభుత్వం ప్రోత్సాహం కానరాక.. ఇంకోవైపు కరోనా కష్టకాలం ఇంకా కొనసాగుతుండడంతో సాగుదారులు విలవిలలాడుతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న పూల ధరలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్నేళ్లతో పోలిస్తే కృష్ణాతీరంలో పూలసాగు ఇటీవల కాలంలో ఆశాజనకంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగవుతోంది. ఇప్పుడు పూలసాగు అంటేనే భయపడే స్థితికి చేరుకుంటోంది.

శీతాకాలం ప్రారంభం నుంచి బంతి, చేమంతిలతో తోటలు ఎంతో రమణీయంగా కనిపిస్తుంటాయి. ఏడాదంతా పూసే కనకాంబరాలు, గులాబీలు సరేసరి. ఈ ఏడాది మార్చి తర్వాత కరోనా ప్రభావానికి మల్లె తోటల రైతులు మార్కెటింగ్‌ అవకాశాలు లేక డీలా పడ్డారు. ఇప్పుడు బంతి, చేమంతి సాగుదారుల పరిస్థితి అదే విధంగా మారింది. బెంగళూరు నుంచి తెప్పించి సాగు చేసిన హైబ్రీడ్‌ రకాలు వాతావరణం అనుకూలించక దిగుబడి రాక రైతులకు కలిసిరాలేదు. నిల్వ ఉండే గుణం కలిగిన పరిమళం వెదజల్లే సెంటెడ్‌ గులాబీకి వినియోగదారుల నుంచి ఎక్కువ గిరాకీ ఉండడంతో విజయవాడ నగర శివారు గోశాల, ఈడ్పుగల్లు తదితర ప్రాంతాల్లో ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూల తోటలు ఊహించని నష్టాన్ని ఎదుర్కొన్నాయి. నత్త ప్రభావం ఈ తోటలను ఆశించి నష్టపరుస్తోంది. తెగుళ్ల బెడద తప్పడంలేదు.

శుభకార్యలు లేక తగ్గిన గిరాకీ..

కరోనా కారణంగా శుభకార్యాల సందడి బాగా పడిపోయింది. పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అయ్యప్ప భజనలు, దీక్షలతో ఆధ్యాత్మిక వాతావరణం ఈ సీజనులో అధికంగా కనిపించేది. పూజల కోసం భారీ సంఖ్యలో పుష్పాలు కొనుగోలు చేసి వినియోగించే వారు. అలాగే వివాహాలు, ఇతర కార్యక్రమాల సమసయంలో కల్యాణ మండపాల్లో పూల అలంకరణ ఎక్కువగా ఉండేది. పండుగ రోజుల్లో పుష్పాల ధరల భారీగా ఉండడానికి కారణం ఆ సమయంలో వీటి కొనుగోళ్లు పెద్ద సంఖ్యలో ఉంటుండడమే. ఈసారి కోవిడ్​ నిబంధనల కారణంగా పండుగలు, వేడకలు, పూజలు అన్నింటా ఆంక్షలు అమల్లో ఉండడంతో ప్రజలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తగిన ఆసక్తి చూపించలేదు.

కరోనా వైరస్ భయం అందరిలోనే ఉండడంతో వేటిని కొనుగోలు చేయాలన్నా ముందు వెనుక ఆలోచించే పరిస్థితే. ఈ ప్రభావం పూలతోటల రైతులకు ప్రతిబంధకంగా మారింది. ఖర్చుకు వెనుకాడకుండా పూలను సాగు చేసినా కలిసిరాని వాతావరణానికి తోడు.. పూలు కోసే కూలీలకు ఇచ్చే డబ్బులు సైతం వెనక్కి వచ్చేలా ధరలు లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా అంతర పంటలు వేసుకుని పూలసాగులోని నష్టాన్ని పూడ్చుకుంటున్నారు.

విజయవాడ నగరంలోని ప్రధానమైన కాళేశ్వరరావుపేట మార్కెట్‌కు పూలను తరలించినా.. అక్కడి వ్యాపారులు సిండికేట్‌ ఆధిపత్యంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. తోటల వద్దకు వచ్చే వారికి మార్కెట్‌ ధర కంటే తక్కువ మొత్తానికే విక్రయిస్తున్నామంటున్నారు. కృష్ణాతీరంలోని ఉండవల్లి, కుంచినపల్లి, తాడేపల్లి తదితర ప్రాంతాల్లో సైతం ఈసారి పూలసాగు తగ్గిపోయింది. దిగుబడి కూడా తక్కువగా ఉంటోంది.

ఇదీ చదవండి: పడిపోయిన టమాటా ధరలు..కష్టానికి ప్రతిఫలం దక్కట్లేదని రైతుల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details