లచ్చిగానిలంక..కృష్ణానది మధ్యలో ఉన్న ప్రాంతం. అక్కడ సుమారు 1200 ఎకరాలలో రైతులు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. నిత్యం వందలాది మంది రైతులు పడవ ప్రయాణం చేసి...మరికొంత దూరం నడిచి...ఈ లంకకు చేరుకుంటారు. రోజూ మాదిరిగానే లంకలో పట్టు పురుగులకు మేత వేయడానికి ఉదయం 5 గంటలకు వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యేసారికి ఒక్కసారిగా వరద నీరు లంక చుట్టూ చేరింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి.
మోపిదేవి మండలం, కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు రోజూలానే పడవపై పంట పొలానికి వెళ్లి...వరదకు లంకలోనే ఉండిపోయారు. గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టంతో తాము నదిలో మునిగిపోతామని భయపడిపోయారు. ఎవరైనా రక్షిస్తారేమోనని ఎదురు చూశారు. కేకలు వేశారు. ఎలాగోలా..సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రాణాలకు తెగించి రైతులను కాపాడారు. అప్పుడే వరద రావడం మొదలవడంతో పోలీసులు కాపాడే సమయానికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకోలేదు.