"ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఏటా ప్రోత్సాహకాలు" - ekbhart, shrest bharat
ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ నినాదంతో ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. విజయవాడలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఫిట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ర్యాలీలు, 5కే రన్ నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలను పలువురు వర్ధమాన క్రీడాకారులకు అందించారు.
జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఉద్యమంలా ప్రారంభమైంది. విజయవాడలో కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఫిట్ ఇండియాలో భాగంగా క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ఇంతియాజ్, సీపీ ద్వారకా తిరుమల రావు జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. అధిక సంఖ్యలో అధికారులు, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ఇది కొనసాగింది.
ర్యాలీ అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వారం రోజుల పాటు క్రీడా దినోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.
ఇకపై ప్రతి ఏడాది వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల పేరుతో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని విజయవాడ సెంట్రల్ వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. క్రీడా దినోత్సవంలో భాగంగా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. జిల్లా నుంచి 12 మంది నగదు పురస్కారానికి ఎంపిక కాగా వారిలో ముగ్గురికి చెక్కులు అందించారు. మిగిలిన వారికి త్వరలోనే చెక్కులు పంపిణీ చేయనున్నారు.