కృష్ణా జిల్లా దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాల్లో సుమారు 20 వేల మత్స్యకార కుటుంబాలున్నాయి. కృష్ణానది, బంగాళాఖాతంలో వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. నాగాయలంక మండలంలో సంగమేశ్వరం, నాలి, పెదపాలెం, సోర్లగొంది, దీనదయాల్ పురం, పర్రచివర, ఎటిమోగ, గుల్లలమోద, ఎదురుమొండి దీవుల్లో 7 గ్రామాలు, కోడూరు మండలములో విశ్వనాథపల్లె, వేణుగోపాలపురం, సాలెంపాలెం, పాలకాయతిప్ప, ఉల్లిపాలెం, కోడూరు, బసవవానిపాలెం, ఊటగుండం, ఇరాలి గ్రామాల్లో మత్స్యకారులు... ఎక్కువగా కృష్ణానదిలో వేట సాగిస్తారు. కొందరు సముద్రంలో వేట సాగిస్తారు.
కృష్ణా జిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామంలో... చేపలు ఎండ బెట్టేందుకు ప్లాట్ఫారం లేక మత్య్సకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగాయలంక మండలం, సోర్లగొంది గ్రామంలో నావల దగ్గరకు వెళ్లేందుకు రోడ్డు మార్గం, వీధి లైట్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. దివిసీమలోని తీర గ్రామాల్లో లభించిన రొయ్యలు, చేపలను ఆదివారం నాగాయలంక గ్రామంలో జరిగే సంతకి తీసుకొస్తారు. సంతలో గంపకు కేవలం రూ.50 వస్తున్నాయి. లాభం లేకుండా పోతోందని... మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.