ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒడ్డున పడని చేపల రైతు.. - corona effect on fishes

కరోనా విలయానికి అన్ని రంగాలూ కుదేలయ్యాయి. చేపల రైతులకూ నష్టాల సెగ తగులుతోంది. చేప ఒడ్డున పడితే ఊపిరాడనట్టే... ఇప్పుడు చేపల రైతు ఒడ్డున పడటానికి సతమతవుతున్నాడు. పట్టణ వినియోగదారుల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో చేపల ధర పడిపోతోందని రైతులు వాపోతున్నారు.

fish farmers problems at ap
ఏపీలో చేపల రైతుల సమస్యలు

By

Published : Jul 24, 2020, 7:22 AM IST

కరోనా విజృంభణతో ప్రజలందరూ కూరగాయల మీదే దృష్టిపెట్టారు. జాగ్రత్తలలో భాగంగా వారు మాంసంను తినడం తగ్గించారు. వైరస్ ప్రభావం చేపలపై పడటంతో వాటి కొనుగోళ్లు , ఎగుమతులు తగ్గిపోయాయి. సాధారణ ధరలతో పోలిస్తే చేపలు కిలోకు రూ.20 వరకు తగ్గింది. కరోనాకు ముందు రోజుకు 300 నుంచి 350 లారీల చేపలు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతయ్యేవి. ఇప్పుడు 200 లారీలు వెళ్లడమూ కష్టంగా మారింది. వినియోగం తగ్గడంతో ఎగుమతులు పడిపోయాయి. లాక్‌డౌన్‌ నాటి కంటే ఇప్పుడే ప్రభావం అధికంగా ఉందని రైతులు వాపోతున్నారు. తగ్గిన కొనుగోలు శక్తిరవాణా పరంగా ఇబ్బంది లేకపోయినా ఉత్తరాది రాష్ట్రాలకు చేపల ఎగుమతులు మాత్రం పెరగడం లేదు. పట్టణ ప్రాంతాల్లో దిగువ మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తి పడిపోవడమే దీనికి ప్రధాన కారణంగా వ్యాపారులు పేర్కొంటున్నారు. విద్యాసంస్థలు, దుకాణాలు మూసివేస్తుండటంతో పనులు కరవై పట్టణాల్లో ఆదాయం తగ్గిందని గుర్తు చేస్తున్నారు. గతంలో వారానికి ఒకసారి చేపలు కొనే కుటుంబాలవారు.. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి వస్తున్నారని వివరిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని.. అది అంతిమంగా చేపల రైతులపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనాతో నేనూ నష్టపోయా...

ఫంగాసియస్‌ రకం చేపను 2019 జూన్‌లో కిలో రూ.84 చొప్పున అమ్మా. అప్పట్లో 7 నెలలు పెంచితే చేప సగటు బరువు 1,300 గ్రాములు ఉంది. ఈసారి 13 నెలల పాటు పెంచితే సగటున 2,700 గ్రాములకు చేరింది. ధర కిలోకు రూ.68 మాత్రమే వచ్చింది. మే నెలలో సగటున 1,700 గ్రాములున్న చేపల్ని కిలో రూ.66 చొప్పున అమ్మా. అంటే అప్పటి కంటే ఇప్పుడే తక్కువ ధర లభించింది. కరోనా సృష్టించిన ఈ సంక్షోభానికి నేనూ నష్టపోయా.

- నాగిరెడ్డి, వైస్‌ ఛైర్మన్‌, వ్యవసాయ మిషన్‌

90% ఉత్పత్తి అక్కడికేకోస్తాలో ఫంగాసియస్‌ రకం సాగు అధికంగా ఉంటుంది. ఏడు నెలల్లో ఎకరాకు 15 టన్నుల వరకు దిగుబడి లభిస్తుంది. అదే కట్ల, రోహు (తెల్ల)రకం చేపలైతే పది నెలలు పెంచినా నాలుగైదు టన్నులు మించి దిగుబడి రాదు. అందుకే అయిదారేళ్లుగా ఎక్కువ మంది రైతులు ఫంగాసియస్‌పైనే దృష్టి సారిస్తున్నారు. చేపల ఉత్పత్తి ఏపీలోనే అధికం. వీటిలో 80% నుంచి 90% వరకు తూర్పు, ఉత్తరాది రాష్ట్రాలకే ఎగుమతి అవుతున్నాయి. స్థానిక వినియోగం 10% నుంచి 20% లోపే ఉంది.

తగ్గిన ధర దాదాపు రెండు నెలలు ఎగుమతులు లేకపోవడంతో రైతులు చేపలను ఎక్కువ రోజులు పెంచాల్సి వచ్చింది. సాధారణంగా చేపల్ని సగటున 1,200 గ్రాముల వరకు పెంచుతుంటారు. రోజులు గడవడంతో ఇప్పుడవి 2,500 గ్రాములకు పైగా బరువు పెరిగాయి. అందుకు తగ్గట్లుగా దాణా, ఇతర ఖర్చులూ పెరిగాయి. ధర మాత్రం పెరగలేదు. గతంలో కిలోకు రూ.75 వరకు లభిస్తుండగా.. ఇప్పుడు రూ.66 దక్కడమూ కష్టంగా ఉంది.

ఇదీ చూడండి.రైతులు ఇచ్చిన భూముల్లో అమ్మకానికి 1600 ఎకరాలు

ABOUT THE AUTHOR

...view details