కృష్ణా జిల్లాలో చెదురు మదురు సంఘటనలు మినహా తొలివిడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. విజయవాడ డివిజనులోని 14 మండలాల్లో 211 పంచాయతీలకు మంగళవారం ఓటింగ్ జరిగింది. ఉదయం 6.30గంటలకే ప్రారంభం కాగా.. అప్పటికే ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు వరుస కట్టారు. తొలివిడతలో మొత్తం 85.06 శాతం పోలింగ్ నమోదైంది. ఇతర ప్రాంతాలకు చెందిన వలస ఓట్లు పెద్దగా నమోదు కాలేదని అభ్యర్ధులు అంటున్నారు. లేకపోతే 90 శాతం దాటాల్సి ఉంది.
పట్టణ వాతావరణం ఉన్న పంచాయతీల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఓట్లు వినియోగించుకున్న వారిలో మహిళలే ఎక్కువ. జగ్గయ్యపేట మండలం వేదాద్రి పంచాయతీలో ఏడో వార్డుకు పోటీచేసిన అభ్యర్థి భర్త రాంబాబుపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. గొడ్డలితో దాడి చేయడంతో వీపు, చేతి భాగంపై గాయాలయ్యాయి. వాగ్వాదంలో ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థిని భర్త గోపాల్, మరి కొంత మంది కలిసి రాంబాబుపై దాడి చేశారు. ఈ సంఘటనను తెదేపా వర్గాలు తీవ్రంగా ఖండించాయి. అక్కడక్కడ స్వల్ప సంఘర్షణలు మినహా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ మాధవీలత, సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం .
3.30వరకు పోలింగ్ నిర్వహించారు.
* పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. విజయవాడ గ్రామీణంలో రామవరప్పాడు, ఎనికేపాడు, నిడమానూరు లాంటి పంచాయతీలు పట్టణంలో కలిసిపోయాయి. ఇక్కడ 76.45 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రామవరప్పాడులో రెండు వర్గాలు పోటాపోటీగా పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించాయి. నున్నలోనూ ఉత్కంఠ భరితంగా పోలింగ్ జరిగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి సంఘటనలు జరగలేదు.